
ప్లాస్టిక్ బాటిళ్లతో కట్టిన భవంతి
ఎలా ఉంది ఈ బిల్డింగ్? బానే ఉందిగానీ.. ఏంటి దీని స్పెషాలిటీ అంటున్నారా? ఒకటా రెండా.. బోలెడున్నాయి. అన్నింటికంటే ముందుగా చెప్పుకోవాల్సింది... ఇదో ప్లాస్టిక్ భవంతి! అవునండీ బాబు.. కొంచెం జాగ్రత్తగా చూడండి.. తైవాన్ రాజధాని తైపీలో ఉండే ఈ భవనం ముందుభాగం మొత్తం ప్లాస్టిక్ బాటిళ్లే కనిపిస్తాయి. అది కూడా ఏకంగా 15 లక్షల బాటిళ్లు!
అయితే ఇక్కడో ట్విస్ట్. వాడి పడేసిన వాటిని నేరుగా వాడకుండా.. కరిగించి మళ్లీ బాటిళ్ల మాదిరిగా తయారు చేసి వాడారు. ఇలా ప్రత్యేకమైన ఆకారంలో తయారు చేయడం వల్ల వాటిని స్టీల్ ఫ్రేమ్‌లో ఒకదానితో ఒకటి జోడించడం సులువు అవుతుంది. బాటిళ్లను చతురస్రాకారపు ప్యానెళ్లుగా అసెంబుల్ చేసి అవసరమైన ఆకారంలో ఏర్పాటు చేయడం ద్వారా ఈ భవనం ఫసాడ్ సిద్ధమైంది. ఇక రెండో ప్రత్యేకత... తొమ్మిది అంతస్తులు ఉన్న ఈ భవనంలో రాత్రిపూట వెలిగే 40 వేల ఎల్‌ఈడీ బల్బులకు కావల్సిన విద్యుత్తు మొత్తాన్ని సోలార్ ప్యానెల్స్, విండ్ మిల్స్‌ల సాయంతో అక్కడికక్కడే ఉత్పత్తి చేస్తారు. ప్లాస్టిక్ బాటిళ్లు పారదర్శకంగా ఉండటం వల్ల పగలు బల్బులు వాడాల్సిన అవసరం దాదాపుగా ఏర్పడదు.
మిగిలిన ప్రత్యేకతలు ఏమిటంటే.. కాంక్రీట్ బిల్డింగ్‌లతో పోలిస్తే దీని బరువు సగం కంటే తక్కువగా ఉంటుంది. అలాగని తేలికగా ఏమీ ఉండదండోయ్! గంటకు 130 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులనైనా.. భూకంపాలనైనా తట్టుకుని నిలబడుతుంది. నిప్పు కూడా తాకకుండా ప్రత్యేకమైన కోటింగ్‌ను ఉపయోగించారు. ఇంతకీ దీని పేరేమిటో? ఎవరు డిజైన్ చేశారో చెప్పనే లేదు కదూ.. నిజానికి ఒది కొత్తది కాదు. దాదాపు ఏడేళ్ల క్రితం తైపీలో జరిగిన ఒక అంతర్జాతీయ ప్రదర్శన కోసం సిద్ధమైంది. ఆర్థర్ హాంగ్ అనే ఆయన దేశంలో ఏటా ఖర్చవుతున్న 45 లక్షల ప్లాస్టిక్ బాటిళ్లకు కొత్త అర్థం చెప్పే ఉద్దేశంతో దీన్ని డిజైన్ చేశారు. కట్టేందుకు రూ.20 కోట్ల వరకూ ఖర్చయింది లెండి! చివరగా.. దీని పేరు.. ‘ఎకో ఆర్క్’!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్