మూడో ప్రపంచ యుద్ధం తప్పదట!
న్యూయార్క్: మూడో ప్రపంచ యుద్ధం అతి సమీపంలోకి వచ్చిందని, ఏ క్షణాన్నైనా యుద్ధం ప్రారంభకావొచ్చని హెచ్చరిస్తూ అనానిమస్ (గుర్తుతెలియని)గా చెప్పుకుంటున్న హ్యాకర్ల బృందం ఓ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసింది. గతంలో జరిగిన ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం తరహాలో ఈ మూడో యుద్ధం కొన్ని సంవత్సరాలుగానీ, నెలల తరబడిగాని జరగదని కూడా పేర్కొంది. సత్వరం ముగిసే ఈ యుద్ధం గతంలోకంటే హోరాహోరీగా, క్రూరంగాను జరుగుతుందని హ్యాకర్ల బృందం అంచనా వేసింది.
మూడో ప్రపంచ యుద్ధం రావడానికి ఉత్తరకొరియా ద్వీపకల్పంలో చోటుచేసుకుంటున్న పరిణామాలే కారణమని కూడా అనానిమస్ హ్యాకర్లు చెబుతున్నారు. చైనా, జపనీస్ ప్రభుత్వాలు పౌర హెచ్చరికలు జారీ చేయడం కూడా ఇందుకు సూచననేనని అంటున్నారు. దక్షిణ కొరియాలో అమెరికా థాడ్ ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థను పరీక్షించడంతోపాటు మూడు ఖండాంతర క్షిపణులను కూడా అమెరికా పరీక్షించడాన్ని హ్యాకర్లు ప్రస్తావించారు.
ఉత్తర కొరియా సరిహద్దుల్లో మోహరిస్తున్న ఆ దేశ సైన్యాన్ని, సైనిక సంపత్తిని కూడా హ్యాకర్లు యుద్ధ సన్నాహాలుగానే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరకొరియా నుంచి చైనా పౌరులను వెనక్కి రావాల్సిందిగా చైనా ప్రభుత్వం ట్రావెల్ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తర కొరియా అణు దాడికి పాల్పడితే ప్రాణాలతో బయటపడేందుకు పది నిమిషాలకు మించి సమయం దొరకదని చైనా పేర్కొంది. ప్రపంచ దేశాలు మూడు బృందాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు యుద్ధం చేస్తాయని హ్యాకర్లు పేర్కొన్నారు.
ఎవరి నాయకత్వాన ఆ బృందాలు ఏర్పాడతాయనే విషాయాన్ని మాత్రం తెలపలేదు. అమెరికా, ఉత్తరకొరియా రెండు బృందాలుగా చీలిపోతే మరి మూడో బృందం ఏ దేశం నాయకత్వాన ఏర్పడుతుందనే విషయంలో హ్యాకర్ల మాటల్లో స్పష్టత లేదు. రష్యా పేరును అసలు ప్రస్తావించకపోవడం కూడా ఇక్కడ గమనార్హం. మూడో ప్రపంచ యుద్ధం కచ్చితంగా జరుగుతుందని తాము చెప్పడం లేదని, యుద్ధం జరిగేందుకు కచ్చితమైన పరిస్థితులు ఉన్నాయని మాత్రమే తాము చెబుతున్నామని పేర్కొన్నారు. అనానిమస్ హ్యాకర్లు విడుదల చేసిన ఏడు నిమిషాల నిడివిగల వీడియోలో మాట్లాడిన హ్యాకర్ తనను గుర్తుపట్టకుండా చిత్రమైన మాస్క్ ధరించాడు.