స్విమ్ సూట్‌లో మగాళ్లు
హెల్మెట్ పెట్టుకొచ్చిన వాళ్లకే పెట్రోల్ అని ఈమధ్య హైదరాబాద్‌లో ఓ కండిషన్ పెట్టారు! అది వర్కవుట్ కాలేదు. హెల్మెట్ అప్పు అడిగి మరీ పెట్రోల్ పోయించుకోవడం మొదలుపెట్టారు మనవాళ్లు. రష్యాలో కూడా ఇలాంటిదే ఒక ట్రిక్ ప్లే అయింది. అయితే అది కండిషన్ కాదు. ఆఫర్! ఎవరైనా సరే స్విమ్ సూట్‌లో, హై హీల్స్ వేసుకుని వస్తే ఫుల్ ట్యాంక్ ఫ్రీ! రష్యాలోని ఒబ్లాస్ట్ ప్రాంతంలో కొత్తగా వెలసిన ఓ పెట్రోల్ బంక్ పబ్లిసిటీ స్టంట్ ఇది. స్టంట్ సక్సెస్ అయింది అనడానికి నిదర్శనం.. ఇదిగో ఇంతదూరంలో ఉన్న మనం ఇప్పుడు ఆ వార్త గురించి చెప్పుకోవడం. ఒకే ఒక్కరోజు (జూలై 21)న అదీ మూడు గంటలు మాత్రమే ఆఫర్ అమల్లో ఉంది. కానీ ఇందులో కూడా ఒక కండిషన్ ఉంది.
స్విమ్ సూట్ నిండుగా ఉండడానికి లేదు. పైగా ఒంటికి తగినట్టుగా ఆకర్షణీయంగా ఉండాలి. అలాంటి వారు నేరుగా ఆ పెట్రోల్ బంక్‌లోకి వెళ్లి, ఎవర్నీ అడక్కుండానే ట్యాంకు నిండా ఫ్రీగా పెట్రోల్ నింపుకుని వెళ్లొచ్చు. ఎవరైనా వెళ్లి ఉంటారా? ఫొటో చూశాక కూడా మీకా డౌట్ ఎందుకు? ఫ్రీ పెట్రోల్ కోసం మగాళ్లు కూడా సిగ్గుపడకుండా స్విమ్‌సూట్‌లో ప్రత్యక్షమయ్యారు!