గ్రెనేడ్ దాడిలో మంత్రి సోదరుడి హతం
పాకిస్థాన్లో సామాన్య పౌరులకే కాదు ప్రధానులు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులకూ రక్షణ దొరకదనే వాస్తవం మరోసారి రుజువైంది. సింధ్ ప్రావిన్స్కు మంత్రిగా వ్యవహరిస్తోన్న అబాదీ జావెద్ నగోరి కార్యాలయంపై శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని దుండగులు హ్యాండ్ గ్రెనేడ్స్, తుపాకులతో జరిపిన దాడిలో మంత్రి సోదరుడు అక్బర్ నగోరి దుర్మరణం చెందారు.
లయారీ ప్రాంతంలోని మంత్రి కార్యాలయంపై దుండగులు జరిపినదాడిలో అక్బర్ సహా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ మంత్రి సోదరుడు అక్బర్ మరణించారు. పెషావర్ సైనిక పాఠశాలపై ఉగ్రదాడి అనంతరం పాక్ సర్కార్ ముష్కరులపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నందుకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు సింధ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి ఖయీమ్ అలీ షా ఆదేశాలు జారీచేశారు.