
కౌలాలంపూర్: మలేసియాలో అదృశ్యమైన ఫ్రాంకో-ఐరిష్ బాలిక నోరా కొయిరిన్(15) మృతి చెందినట్టు గుర్తించారు. నెగ్రిసెంబిలాన్ రాష్ట్రంలోని ‘డుసన్ ఫారెస్ట్ ఎకోరిసార్ట్’ నుంచి ఈ నెల 4న ఆమె అదృశ్యమైంది. చిన్నారి కోసం మలేసియా పోలీసులు అడవంతా జల్లెడ పట్టారు. రిస్టార్‌కు రెండున్నర కిలోమీటర్ల దూరంలో నీటి ప్రవాహంలో రాయిపై నగ్నంగా పడివున్న బాలిక మృతదేహాన్ని కనుగొన్నట్టు మలేసియా జాతీయ పోలీసు విభాగం డిప్యూటీ చీఫ్ మజ్లాన్ మన్సూర్ తెలిపారు. మృతదేహాన్ని హెలికాప్టర్‌లో ఆస్పత్రి తరలించినట్టు చెప్పారు. బాలిక శరీరంపై గాయాలేమైనా ఉన్నాయా అనే దానిపై వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. చనిపోయిన బాలిక నోరా కొయిరిన్‌గా ఆమె తల్లిదండ్రులు ధ్రువీకరించారు. బాలిక మరణానికి గల కారణాలు పోస్ట్‌మార్టం తర్వాత వెల్లడయ్యే అవకాశముంది.
నోరా కొయిరిన్ మృతదేహాన్ని హెలికాప్టర్‌లో తరలిస్తున్న సహాయక సిబ్బంది(రాయిటర్స్ ఫొటో)
నోరా కొయిరిన్ కిడ్నాప్ అయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా, పోలీసులు మాత్రం మిస్సింగ్ కేసుగానే పరిగణిస్తున్నట్టు చెబుతున్నారు. కాగా, నోరా కొయిరిన్ ఆచూకీ కోసం పోలీసులతో పాటు చాలా మంది వలంటీర్లు గాలించారు. తమ కుమార్తె ఆచూకీ చెప్పిన వారికి 50 వేల రింగిట్స్(సుమారు 8.5 లక్షలు) నజరానా ఇస్తామని నోరా కొయిరిన్ తల్లిదండ్రులు ప్రకటించారు. చిన్నారిని ఎవరైనా హత్య చేశారా, అడవిలోని పరిస్థితుల వల్ల ఆమె చనిపోయిందా అనేది వెల్లడి కావాల్సి ఉంది. (చదవండి: ఆ అమ్మాయి కోసం 300 మంది గాలింపు)
Comments
Please login to add a commentAdd a comment