లండన్ : ప్రధాని నరేంద్ర మోదీ యూకే పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. భారత జాతీయ జెండాకు ఘోర అవమానం జరిగింది. పాకిస్థాన్ అనుకూల ఖలిస్థాన్ ఆందోళనకారులు భారత జాతీయ జెండాను అవనతం చేసి.. చించి ఆపై తగలబెట్టారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది.
లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ హాల్లో కామన్‌వెల్త్ దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సు (చోగమ్) జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంటు స్క్వేర్ వద్ద మొత్తం 53 కామన్వెల్త్ దేశాల జెండాలను అధికారులు ఎగుర వేశారు. అయితే మోదీ రాకను వ్యతిరేకిస్తూ పాక్ చెందిన మత గురువు అహ్మద్ నేతృత్వంలో యూకే సిక్కు ఫెడరేషన్‌కు చెందిన ఖలిస్థాన్ అనుకూల ఆందోళనకారులు, మోదీ వ్యతిరేక మైనారిటీల గ్రూప్‌కు చెందిన 500 మంది అక్కడికి ర్యాలీగా చేరుకున్నారు. తొలుత వీరంతా అక్కడి మహాత్మగాంధీ విగ్రహం వద్ద జెండాలు, బ్యానర్లు ప్రదర్శించారు. ఆపై జెండా కర్ర నుంచి భారతీయ పతాకాన్ని అవనతం చేసి చించేశారు. ఆపై దాన్ని కాల్చేసి.. అక్కడ పాక్ ఆక్రమిత కశ్మీర్, ఖలిస్థాన్ జెండాలను ఎగురవేశారు. ఇదంతా సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో చోటు చేసుకుంది.
లండన్ పోలీసుల తీరుపై విమర్శలు...
ఈ ఘటన జరుగుతున్నప్పుడు లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు చూస్తూ ఉండిపోయారే తప్ప.. నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న ఓ భారతీయ సీనియర్ జర్నలిస్ట్ చిత్రీకరించగా.. అతనిపై కూడా దాడి చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో అలసత్వం ప్రదర్శించిన లండన్ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
భారతీయ జెండాను తొలగించిన దిమ్మె ఇదే
భారత్ స్పందన...
జాతీయ జెండాకు జరిగిన అవమానంపై భారత విదేశాంగ అధికార ప్రతినిధి ఒకరు స్పందించారు. ‘జెండాను అవనతం చేసి చించేయడంపై బ్రిటిష్ అధికారులకు మా నిరసన తెలియజేశాం. ఆ ఘటనకు వారు క్షమాపణలు చెప్పారు. ఇటువంటి శక్తులు సమస్యలు సృష్టించవచ్చని ముందు నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నాం. చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఇది చోటు చేసుకోవటం దురదృష్టకరం. ఆ స్థానంలో జాతీయ జెండాను కొత్తది ఏర్పాటు చేశారు’’ అని ప్రధానితోపాటు పర్యటిస్తున్న బృందంలోని అధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment