గూగుల్ ఉద్యోగులకు మాడ్యులర్ ఇళ్లు
న్యూయార్క్: ఐటీ కంపెనీలకు నిలయమైన అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఇళ్ల కొరత తీవ్రంగా ఉండి, ఇంటి ధరలు ఆకాశాన్ని అందుకోవడంతో గూగుల్ కంపెనీ తమ ఉద్యోగుల సౌకర్యార్థం ఏకంగా 300 మాడ్యులర్ ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు గూగుల్ మాతృసంస్థ అయిన అల్ఫాబెట్ ఇన్‌కార్పొరేషన్ ఈ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన ‘ఫ్యాక్టరీ ఓఎస్’తో మూడు కోట్ల డాలర్ల ఒప్పందం చేసుకుంది. నిర్దిష్ట వాతావరణంగల ఫ్యాక్టరీలో ఈ మూడు వందల మాడ్యులర్ ఇళ్లను నిర్మించి ఫ్యాక్టరీ ఓఎస్ కంపెనీ గూగుల్ చెప్పిన చోటుకు వాటిని తరలిస్తుంది.
మియామి, డెట్రాయిడ్, న్యూయార్క్ రాష్ట్రాల్లో కూడా ఇళ్ల కొనగోళ్లు అతి భారంగా మారడంతో స్థానిక ప్రజలంతా ఇప్పుడు మాడ్యులర్ ఇళ్లనే ఆశ్రయిస్తున్నారు. తాము నిర్మించిన ఇళ్లలో అద్దెకు ఉండడం వల్ల నెలకు ఎవరైనా తమ అద్దెలో 700 డాలర్లు పొదుపు చేయవచ్చని ‘ఫ్యాక్టరీ ఓఎస్’ వ్యవస్థాపక సీఈవో రిక్ హోలీడే చెబుతున్నారు. అలమెడా, శాంతాక్లారా, శాన్‌మాటియో సహా సిలికాన్ వ్యాలీలో 2012లో ఇళ్ల ధరలు 535,614 డాలర్లు ఉండగా, అది 2016 నాటికి 888,444 డాలర్లకు చేరుకుందని ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ సంస్థ ‘ట్రూలియా’ తెలిపింది.
ఇళ్ల రియల ఎస్టేట్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో టెక్ దిగ్గజ కంపెనీలన్నీ తమ ఉద్యోగుల కోసం మాడ్యులర్ ఇళ్లనే ఆశ్రయిస్తున్నాయి. ఫేస్‌బుక్ ఇన్‌కార్పొరేషన్ మెన్లోపార్క్‌లో తమ ఉద్యోగుల కోసం 1500 ఇళ్లను నిర్మించాలనుకుంటోంది. ఇక్ ఆపిల్ కంపెనీ కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో 28 లక్షల చదరపు అడుగుల్లో కొత్తగా నిర్మించిన సర్కులర్ భవనంలోకి తమ వేలాది మంది ఉద్యోగులను తరలించాలని నిర్ణయించింది.