టెన్షన్‌ పడుతూ లవ్‌ప్రపోజ్‌ చేసిన సుందర్‌పిచాయ్‌ | google ceo sundar pichai love proposal situation on birthday special | Sakshi
Sakshi News home page

టెన్షన్‌ పడుతూ లవ్‌ప్రపోజ్‌ చేసిన సుందర్‌పిచాయ్‌

Published Mon, Jun 10 2024 2:32 PM | Last Updated on Mon, Jun 10 2024 3:24 PM

google ceo sundar pichai love proposal situation on birthday special

భారత సంతతికి చెందిన వ్యక్తులు ప్రపంచంలోని అనేక కంపెనీలు, టెక్‌ దిగ్జజాలకు అధిపతులుగా తమ ప్రతిభ  చాటుతున్నారు. అందులో ప్రపంచ నం.1 సెర్చ్‌ఇంజిన్‌ కంపెనీ గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌కు ప్రత్యేకస్థానం ఉంది. తమిళనాడులోని మధురైలో పుట్టి టాప్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదించి అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా సీఈఓగా ఎంపికవ్వడం మామూలు విషయంకాదు. ఈరోజు సుందర్‌ పిచాయ్‌(52) పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

సుందర్ పిచాయ్ అసలు పేరు పిచాయ్‌ సుందరరాజన్ కాగా.. అమెరికాకు వెళ్లిన తర్వాత అసలు పేరును కుదించి తోటి ఉద్యోగులు సుందర్‌పిచాయ్‌గా పిలవడం ప్రారంభించారు. ఆయన 1972, జూన్‌ 10న తమిళనాడులోని మధురైలో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లి లక్ష్మి, స్టెనోగ్రాఫర్..తండ్రి రేగునాథ పిచాయ్ బ్రిటిష్ హయాంలో జనరల్‌ ఎలక్ట్రికల్ కంపెనీ(జీఈసీ)లో ఇంజినీర్‌గా పనిచేసేవారు. సుందర్‌ స్థానికంగా ఉన్న వనవాణి మెట్రిక్యులేషన్ పాఠశాలలో పదో తరగతి దాకా చదివారు. చెన్నైలోని జవహర్ విద్యాలయలో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో మెటలార్జికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశారు. అనంతరం అధ్యాపకులు అక్కడే పీహెచ్‌డీ చేయాలని సలహా ఇచ్చారు. కానీ, 1993లో అమెరికా వెళ్లి సుందర్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ అండ్ మెటీరియల్స్ సైన్స్‌లో ఎంఎస్, వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.

చదువుపూర్తయ్యాక అప్లైడ్‌మెటీరియల్స్‌ కంపెనీలో ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో పనిచేశారు. మెకిన్సే అండ్‌ కంపెనీలో మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2004లో గూగుల్ సంస్థలో ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ విభాగం ఉపాధ్యక్షుడిగా చేరారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించిన బృందానికి సారథ్యం వహించారు. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ టూల్‌బార్ రూపకల్పనలోనూ కీలక పాత్ర పోషించారు. గూగుల్ డ్రైవ్‌, జీమెయిల్‌, గూగుల్‌ మ్యాప్స్‌ వంటి ఇతర అప్లికేషన్‌ల అభివృద్ధిని పర్యవేక్షించారు.

మార్చి 13, 2013న పిచాయ్ తాను పర్యవేక్షించిన గూగుల్‌ ఉత్పత్తుల జాబితాను ఆండ్రాయిడ్‌కు జోడించారు. ఆగస్టు 10, 2015లో పిచాయ్‌ గూగుల్‌ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. గూగుల్‌ ఆయన సారథ్యంలో ఇటీవల ‘జెమినీ’ అనే జనరేటివ్‌ ఏఐను ఆవిష్కరించింది. ఆయన టెక్‌ప్రపంచానికి చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో పద్మభూషణ్‌తో గౌరవించింది. 2019 డిసెంబర్‌లో గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సుందర్‌ 2022 సంవత్సరానికిగానూ 226 మిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.1850కోట్లకు పైమాటే) పారితోషికం అందుకున్నారు.

ఇదీ చదవండి: రూ.83 వార్షికవేతనం తీసుకున్న స్టీవ్‌జాబ్స్‌..!

టెన్షన్‌ పడిన సీఈఓ..

సుందర్‌ది ప్రేమ వివాహం. ఐఐటీ ఖరగ్‌పుర్‌లో బీటెక్‌ చూస్తున్నపుడు అంజలితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని చెప్పారు. తన భార్య గురించి ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘మేం ఖరగ్‌పుర్‌ ఐఐటీలో తొలిసారి కలిశాం. చాలా బిడియస్తుడినైన నన్ను ఆమే మార్చింది. తనకు ప్రపోజ్‌ చేసేటప్పుడు నా టెన్షన్‌ ఇప్పటికీ గుర్తే. నా మనసులో మాట అంజలికి చెప్పడం కన్నా, గూగుల్‌లో ఈ స్థానాన్ని సంపాదించడమే తేలిక అనిపిస్తోందిప్పుడు. నా ప్రేమను అంగీకరించడం తన గొప్పతనం. అప్పటికి నేను ఆర్థికంగా స్థిరపడకపోయినా, నన్ను నమ్మింది. నా జీవితంలో ప్రతి కీలక సందర్భంలోనూ తనదే ముఖ్య పాత్ర. ఎన్నో ముఖ్య విషయాల్లో సందిగ్ధంలో ఉన్నప్పుడు అంజలే నా సలహాదారు. తక్షణ పరిష్కారాన్ని సూచిస్తుంది. మైక్రోసాఫ్ట్‌, యాహూ, ట్విటర్‌ వంటి సంస్థల నుంచి అవకాశాలెన్నో వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోలేకపోయా. అప్పుడు గూగుల్‌ నుంచి వెళ్లొద్దన్న తన సూచనను పాటించడమే నన్నీ స్థాయిలో నిలబెట్టింది’ అన్నారు. సుందర్‌ దంపతులకు కావ్య పిచాయ్‌, కిరణ్‌ పిచాయ్‌ ఇద్దరు పిల్లలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement