ముంబై మారణహోమం (26/11) సూత్రధారి, లష్కరే తోయిబా కమాండర్ జకీవుర్ రెహ్మాన్‌తోపాటు మరో ఆరుగురు నిందితులపై వ్యక్తిగతంగా 166 మంది హత్యలకు పురికొల్పిన అభియోగాలు నమోదు చేయనున్నట్లు
పాక్ ఉగ్రవాద నిరోధక కోర్టు రూలింగ్
లాహోర్: ముంబై మారణహోమం (26/11) సూత్రధారి, లష్కరే తోయిబా కమాండర్ జకీవుర్ రెహ్మాన్‌తోపాటు మరో ఆరుగురు నిందితులపై వ్యక్తిగతంగా 166 మంది హత్యలకు పురికొల్పిన అభియోగాలు నమోదు చేయనున్నట్లు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు శుక్రవారం రూలింగ్ ఇచ్చింది. ఈ విషయాన్ని కోర్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో నిందితుల క్రాస్ ఎగ్జామినేషన్‌కు కోర్టు అనుమతించలేదన్నారు.
కేసును బలోపేతం చేసేందుకు వీలుగా నిందితులపై అభియోగాల నమోదును సవరించాలంటూ ప్రాసిక్యూషన్ రెండు నెలల కిందట కోర్టులో దరఖాస్తు చేసింది. అలాగే మృతుల పోస్టుమార్టం నివేదికలను భారత ప్రభుత్వం పంపేలా కోరాలని విజ్ఞప్తి చేసింది. కాగా, కేసు తదుపరి విచారణ ఈ నెల 25న జరగనుంది.