దోమ కుడితే కంటిచూపు పోయింది!
లండన్: దోమలు కుడితే మలేరియా, డెంగీ లాంటి వ్యాధులొస్తాయని మాత్రమే ఇన్నాళ్లూ తెలుసు. కానీ ఇప్పుడు బ్రిటన్‌లో ఓ మహిళకు మాత్రం దోమ కుట్టడం వల్ల కంటిచూపే పోయింది. వైద్య చరిత్రలో ఈ అరుదైన ఘటనపై వైద్యుడు అభిజిత్ మోహిత్ వెల్లడించిన వివరాల ప్రకారం బ్రిటన్‌కు చెందిన ఓ 69 ఏళ్ల మహిళ గత ఏడాది జూలైలో గ్రెనెడాలోని కరీబియన్ దీవులను సందర్శించింది. ఈ పర్యటన సందర్భంగా ఆమెను అక్కడి దోమలు కుట్టాయి. అనంతరం ఆమెకు ఫ్లూ, జ్వరం, ఒంటిపై దద్దుర్లు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు చుట్టుముట్టాయి.
మూడు వారాల అనంతరం ఆగష్టులో బ్రిటన్ వెళ్లిపోయినప్పటికీ ఈ సమస్యలు ఆమెను వెంటాడాయి. అక్కడ ఆమె వెస్ట్ మిడ్‌ల్యాండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డీనరీ అండ్ క్వీన్స్ ఆసుపత్రిలో చేరింది. పరీక్షల్లో ఆమెకు చికన్‌గున్యా సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఆసుపత్రిలో చేరిన మరుసటి రోజే ఆమెలో కుడి కంటి చూపు కూడా మందగించింది. కుడి కంటిలోని కింది వైపు సగం చూపును పూర్తిగా కోల్పోయింది. దోమకాటు ద్వారా శరీరంలోకి చొరబడిన వైరస్ ఆమె కుడి కన్ను పని చేసేందుకు సహకరించే నాడీ వ్యవస్థపై దాడి చేసి, ధ్వంసం చేసిందని వైద్యులు కనుగొన్నారు. కంటి చూపును కలిగించే నాడీ వ్యవస్థ సగం పనిచేయడం లేదని తెలుసుకున్నారు. ఈ సమస్యను బాధితురాలు ముందుగా గుర్తించకపోవడంతో ఆమె కంటి చూపును కోల్పోవాల్సి వచ్చింది.