దోమకుట్టి కన్ను పోయింది
లండన్: దోమల వల్ల మలేరియా, పైలేరియా వంటి రోగాలతోపాటు మరెన్నో ఇతర వ్యాధులు వస్తాయని మనకు తెలిసిందే. అయితే బ్రిటన్ లో మాత్రం ఓ మహిళకు దోమకాటు వల్ల ఏకంగా కనుచూపు పోయింది. దీంతో ఇది అరుదైన కేసుగా మిగిలింది. అక్కడ భారత సంతతికి చెందిన ఓ వైద్యుడు తెలిపిన వివరాల ప్రకారం బ్రిటన్ కు చెందిన ఓ 69 ఏళ్ల మహిళ 2014 జూలై నెలలో గ్రెనడాలోని కరేబియా దీవులను సందర్శించింది. ఆ సమయంలో ఆమెకు ఓ దోమ కుట్టడంతో ముందు చికెన్ గున్యా వ్యాధి భారిన పడింది.
అలా కొద్ది కాలం తర్వాత చూపుమందగించడంతో బ్రిటన్ లోని వెస్ట్ మిడ్ ల్యాండ్ లోగల పోస్టుగ్రాడ్యుయేట్ డీనరి అండ్ క్వీన్స్ ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లింది. అందులో ఆమెను డాక్టర్ అర్బిజిత్ మోహెతే అనే వైద్యుడు పరీక్షించాడు. ఈ పరీక్షల్లో దోమకాటు ద్వారా శరీరంలోకి చొరబడిన వైరస్ ఆమె కుడికన్ను పనిచేసేందుకు సహకరించే వ్యవస్థపై దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేసిందని గుర్తించారు. ముందస్తుగా ఈ సమస్య బాధితురాలు గుర్తించకపోవడంతో చివరి దృష్టిలోపాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కంటి చూపు విషయంలో ఎంత తొందరగా చికిత్స చేసుకుంటే అంతమంచిది లేదంటే దుష్ప్రభావాలు చాలా ఎక్కువ అని వైద్యులు సెలవిచ్చారు.