అందమైన స్విమ్మింగ్‌ పూల్స్‌ ఇవే! | Most Beautiful Swimming Pools in the World | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో అందమైన స్విమ్మింగ్‌ పూల్స్‌

Published Sat, Feb 8 2020 2:05 PM | Last Updated on Sat, Feb 8 2020 4:24 PM

Most Beautiful Swimming Pools in the World - Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచంలో అందమైన ఈత కొలను(స్విమ్మింగ్‌ పూల్స్‌)ల గురించి తెలుసుకోవాలంటే ఈ రోజుల్లో పెద్ద కష్టం కాదు. సోషల్‌ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పూల్స్‌ఆఫ్‌ఇన్‌స్టాగ్రామ్, పూల్స్‌ఆఫ్‌దివరల్డ్, పూల్‌లైఫ్, పూల్‌సైడ్‌’ హ్యాష్‌ ట్యాగ్‌లతో ఎన్నో సుందరమైన ఈత కొలనుల ఫొటోలను చూడవచ్చు. కాని అందులో అన్నీ మంచివేమి కాదు, ఎక్కువ కొలనులు సముద్రం నీటితో ఉప్పుగా ఉండి, సాంద్రత ఎక్కువగా ఉంటుంది. సాంద్రత ఎక్కువున్న నీటిలో ఎక్కువ సేపు ఈత కొట్టలేం. త్వరగా అలసిపోతాం. నీటి అడుగు భాగం కనిపించదు. నీటి గుండా దేన్నీ చూడలేం.

ఇండోనేసియాలోని బాలి రెయిన్‌ ఫారెస్ట్‌లో ఉన్న త్రీ టైర్‌ ఈత కొలను, ఫ్రాన్స్‌లోని ఇబిజా నగరానికి బలియారిక్‌ సముద్ర తీరం వెంటనున్న ఈత కొలను, అమెరికాలోని హూబర్టస్‌లో ఆల్పిన్‌ మనోరమా హోటల్‌లో ఆరు అందమైన ఈత కొలనులు ఉన్నాయి. ఇటలీలోని దక్షిణ టిరోల్‌ పర్వత ప్రాంతంలో మీరామోంటి బోటిక్‌ హోటల్‌లో, స్విడ్జర్లాండ్‌లోని హోటల్‌ విల్లా హొనెగ్‌లో తీర్చినట్లుగా ఈత కొలనులు ఉన్నాయి.

వీటిని చూస్తుంటే అబ్బా! జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ఈత కొలనులో ఈత కొట్టాలనిపించకపోదు. వీటిలో ఈత కొడుతుంటే కొండల మధ్య సహజ సిద్ధమైన నదిలో ఈదుకుంటూ ప్రకృతి ఒడిలోకి జారిపోతున్నట్లు, ఈదుకుంటూ సముద్ర కెరటాల్లోకి వెళుతున్నట్లు, ఆకాశంలో తేలుతూ ఈత కొడుతుంటే కింద భూమి మీద అడవులు, కొండలు చూస్తున్నట్లు ఒక్కో దాంట్లో ఒక్కోరకమైన అనుభవం కలుగుతుంది. కొన్నింటిని సముద్ర తీరంలో నిర్మించగా, మరికొన్నింటిని నీటి సరస్సుల వద్ద, మరికొన్నింటిని అడవుల మధ్య నిర్మించారు. కొన్ని ఈత కొలనులకు అడుగు భాగాన అద్దాలుంటే చాలా కొలనులకు పక్క భాగాన అందాలుండి ప్రకృతిని ఆస్వాదించేందుకు తోడ్పడతున్నాయి. హూబర్టోస్‌లోని ఆల్ఫిన్‌ పనోరమా హోటల్‌లో 25 మీటర్ల పొడవైన ఈత కొలనులో కొంత అడుగు భాగం మొత్తం అద్దాలతోనే నిర్మించారు. అంటే ఆకాశంలో ఈత కొడుతూ భూమ్మీది అందాలను తిలకించవచ్చు.

ఈ ఈత కొలనులన్నీ సముద్ర మట్టానికి వెయ్యి అడుగుల నుంచి మూడు వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. వీటిలో స్వచ్ఛమైన నీటిని నింపడమే కాకుండా ఎప్పుడూ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా వేడి నీటిని కూడా పంప్‌ చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement