
ట్విన్స్... కానీ పుట్టినరోజులు వేరు..!
ఆమె ఇప్పుడు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మరో రెండు నెలల్లో మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఆమెరికా సియాటిల్ ప్రాంతానికి చెందిన హోలీ గార్వియాట్ కు... కేవలం 450 గ్రాముల బరువుతో పుట్టిన ఓ శిశువు... ఇప్పుడు సైన్స్ అద్భుతాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది.
గర్భవతి అయిన హోలీకి డాక్టర్లు జనవరిలో ప్రసవం అవుతుందని ముందుగా అనుకున్నారు. కానీ పోస్ట్ పార్టమ్, పార్టమ్ సమస్యతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యాన్ని, కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని రక్షించేందుకు ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. రక్త స్రావ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆమె గర్భంలోని ఓ శివుకు కేవలం 23 వారాలకే జన్మనిచ్చేట్టు ఏర్పాట్లు చేశారు. కడుపులోని కవలల్లో ఒకరిని శస్త్రచికిత్స తో జాగ్రత్తగా బయటకు తీశారు. మరో శిశువును గర్భంలోనే ఉంచారు. అమ్మ కడుపులో మరో రెండు నెలలు గడిపేందుకు ఆ నవజాత శిశువు లోగాన్ కు అవకాశం ఇచ్చారు. అంటే వారిద్దరూ కవలలే అయినా పుట్టిన రోజులు మారిపోయాయి. అయితే ప్రస్తుతం కడుపులో ఉన్న శిశువు ఆరోగ్యంగానే ఉన్నాడని, మరోబిడ్డను ఆరోగ్యపరంగా కడుపులో ఉంచే అవకాశం లేదు కనుక ముందే బయటకు తీయాల్సి వచ్చిందని హోలీ చెప్తోంది. డాక్టర్లు ఆ ప్రిమెట్యూర్ బేబీని ఆస్పత్రిలోనే ఉంచి తగిన వైద్యాన్ని అందిస్తున్నారు.
కవలలిద్దరూ తల్లి గర్భంలోని ప్లాసెంటాను షేర్ చేసుకుని ఉండే సమయంలో ఇద్దరినీ విడదీసి ఇన్ యుటరీ సర్జరీ చేయడం ఎంతో కష్టసాధ్యమైన పని అని డాక్టర్ మార్టిన్ వాకర్ అంటున్నారు. దీన్ని ట్విన్ ట్విన్ ట్రాన్స్ ఫ్యూజన్ సిండ్రోమ్ అంటారని చెప్తున్నారు. తల్లి గర్భంలో రక్తస్రావం వల్ల ఇద్దరిలో ఒక శిశువు బలహీనంగానూ, రక్తహీనతతో బాధపడుతున్నాడని, మరో బిడ్డ... అవసరానికి మించి రక్తాన్ని పొందుతూ హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితిలో ఉండటంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని వివరించారు. అయితే ఇద్దరి రక్త నాళాలను విడదీసి సమస్యను పరిష్కరించగలిగామని చెప్తున్నారు.
ఆపరేషన్ చేసిన వారం తర్వాత గార్వియాట్ కు పరీక్షలు నిర్వహించామని, కడుపులోని మరో బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రసవం అయ్యే అవకాశం ఉందని డాక్లర్ వాకర్ చెప్తున్నారు. ఈ ప్రక్రియ జరిగి వారం రోజులు సమయం దాటిందని, ఈ వారంలో కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంలో ఎంతో మార్పు వచ్చిందని, ఆరోగ్యంగా పెరుగుతున్నాడని వైద్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.