ఐసిస్‌ అబద్ధం.. యూఎస్‌ దాడితో భారీ నష్టమే | Mother of all bombs’ by US killed 90 IS fighters: Afghan officials | Sakshi
Sakshi News home page

ఐసిస్‌ అబద్ధం.. యూఎస్‌ దాడితో భారీ నష్టమే

Published Sat, Apr 15 2017 1:18 PM | Last Updated on Thu, Mar 28 2019 6:08 PM

ఐసిస్‌ అబద్ధం.. యూఎస్‌ దాడితో భారీ నష్టమే - Sakshi

ఐసిస్‌ అబద్ధం.. యూఎస్‌ దాడితో భారీ నష్టమే

న్యూయార్క్‌: అమెరికా అతిపెద్ద బాంబుతో చేసిన దాడి వృధా కాలేదని స్పష్టమైంది. దాదాపు 90 మందికిపైగా ఉగ్రవాదులు ఈ బాంబు దాడిలో హతమయ్యారని అప్ఘనిస్థాన్‌ ప్రభుత్వం శనివారం అధికారికంగా ప్రకటించింది. పెద్ద మొత్తంలో ఇస్లామిక్‌ స్టేట్‌ దెబ్బతిందని కూడా పేర్కొంది. అమెరికాలోని అతిపెద్ద బాంబుగా పేర్కొన్న జీబీయూ-43/బీ (ఎంఓఏబీ)ని అప్ఘనిస్థాన్‌లోని నంగర్‌హార్‌ ప్రావిన్స్‌లోగల ఐసిస్‌ సొరంగ బంకర్లపై వేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 36 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తొలుత వార్తలు రాగా.. అసలు తమకు ఎలాంటి నష్టం జరగలేదని, ఒక్క ఉగ్రవాది కూడా చనిపోలేదని ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించింది.

దీంతో అమెరికా ప్రయత్నం విఫలమైందా అని మీడియాలో చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ బాంబు దాడికి సంబంధించి తాజాగ అఫ్ఘనిస్థాన్‌ అధికారిక ప్రతినిధి అచ్చిన్‌ జిల్లా గవర్నర్‌ ఇస్మాయిల్‌ షిన్‌వారి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. దాదాపు 92మంది ఐసిస్‌ ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలిపారు. అయితే, ఈ దాడిలో తమ సైనికులకుగానీ, సామాన్యులకు గానీ ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. అయితే, గతంలో ఈ బాంబు దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలోనే సామాన్య పౌరులు కూడా ఉండేవారని, ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్త పరిణామాల కారణంగా వారంతా ఆ ప్రాంతాలను విడిచి వెళ్లారని వివరించారు. ఈ కారణంగానే పెద్ద ప్రమాదం తప్పినట్లయిందని అభిప్రాయపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement