is fighters
-
టీనేజ్‌లో తప్పటడుగు.. ఎట్టకేలకు యూకేకు?!
లండన్: ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)లో చేరి ప్రస్తుతం సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్డీఎఫ్) రెఫ్యూజీ క్యాంపులో ఆశ్రయం పొందుతున్న షమీమా బేగం ఎట్టకేలకు యూకేలో అడుగుపెట్టనుంది. తన పౌరసత్వాన్ని రద్దు చేసిన బ్రిటన్ ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్ధంకానుంది. ఈ మేరకు యూకే కోర్టు(కోర్ట్ ఆఫ్ అప్పీల్) గురువారం షమీమాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఉత్తర సిరియాలో ఆశ్రయం పొందుతున్న ఆమె స్వదేశానికి తిరిగి వచ్చేందుకు, స్పెషల్ ఇమ్మిగ్రేషన్స్ అప్పీల్స్ కమిషన్ ముందు పౌరసత్వం గురించి తన వాదన వినిపించేందుకు అర్హురాలేనని స్పష్టం చేసిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ విషయంపై స్పందించిన యూకే ప్రభుత్వం జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా షమీమా పౌరసత్వం పునరుద్ధరించలేమని, ఆమెను దేశంలో అడుగుపెట్టేందుకు అనుమతించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. కోర్టు తీర్పు తమను నిరాశకు గురిచేసిందని, అప్పీలుకు వెళ్లేందుకు అనుమతి కోరుతామని హోం ఆఫీస్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. (చదవండి : పిక్నిక్కు వెళ్తున్నామని చెప్పి.. గర్భిణిగా!) అసలేం జరిగిందంటే... బంగ్లాదేశ్- బ్రిటీష్ పౌరసత్వం కలిగిన షమీమా బేగం(20).. లండన్‌లోని బెత్నల్ గ్రీన్ అకాడమీలో చదువుకునేది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె ఐఎస్ సిద్ధాంతాలు, వీడియోల పట్ల ఆకర్షితురాలై.. పదిహేనేళ్ల వయసులో 2015లో తన తోటి విద్యార్థులు ఖతీజా సుల్తానా, అమైరా అబేస్‌లతో కలిసి లండన్ నుంచి సిరియాకు పారిపోయింది. పిక్నిక్కి వెళ్తున్నామని చెప్పి పరారైన వీరు మొదట టర్కీకి వెళ్లి... అక్కడి నుంచి సిరియాలో ఐఎస్‌కు పట్టు ఉన్న రాకాకు చేరుకున్నారు. ఈ క్రమంలో రాకా చేరిన పది రోజుల తర్వాత అక్కడే ఇస్లాం స్వీకరించిన ఓ డచ్ వ్యక్తి(27)ని షమీమా పెళ్లి చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఆమె జీవితం తలకిందులైంది. సరైన తిండిలేక, పోషకాహార లోపం వల్ల రెండుసార్లు గర్భవిచ్చిత్తి కావడంతో శారీరంగా బలహీనపడిపోయింది.(‘నా కూతురిని బ్రిటన్‌కు తీసుకురావాల్సిందే..’) నన్ను రానివ్వండి ప్లీజ్.. ఈ నేపథ్యంలో ఐఎస్ నుంచి రాకాను స్వాధీనం చేసుకునే క్రమంలో స్థానిక కుర్దిష్ వర్గాలు ఐఎస్‌కు మద్దతుగా నిలుస్తున్న ‘జీహాదీ’ లను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయం సాధించాయి. దొరికిన వాళ్లను దొరికినట్టుగా అదుపులోకి తీసుకున్న సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్డీఎఫ్) వారిని క్యాంపులకు తరలించడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో 2019లో షమీమా కూడా వారికి చిక్కడం, ఆమె భర్తను ఎస్డీఎఫ్ దళాలు అదుపులోకి తీసుకోవడం జరిగిపోయాయి. అయితే అప్పటికే నిండు గర్భిణిగా ఉన్న ఆమె శరణార్థి శిబిరంలోకి చేరుకుంది. అప్పటికే పూర్తిగా నీరసించిన పోయిన షమీమా.. తప్పు తెలుసుకున్నానని, ఐసిస్ ఓడిపోతోందని, కాబట్టి తనకు పుట్టబోయే అయినా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ అంతర్జాతీయ మీడియా వేదికగా తనను బ్రిటన్ వచ్చేందుకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆమె అభ్యర్థనను తిరస్కరించిన బ్రిటన్.. తమ పౌరుల భద్రతా కారణాల దృష్ట్యా పౌరసత్వాన్ని కూడా రద్దు చేస్తున్నామని గతేడాది ఫిబ్రవరిలో ప్రకటించింది. కాగా అప్పటికే షమీమాకు పుట్టిన బిడ్డ నిమోనియాతో మరణించడంతో ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. షమీమాను అరెస్టు చేయవచ్చు! ఇక పౌరసత్వ విషయంపై షమీమా తరఫున ఆమె లాయర్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. ఆమెకు బ్రిటీష్- బంగ్లాదేశ్ ద్వంద్వ పౌరసత్వాలు ఉన్నందున ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోర్ట్ ఆఫ్ అప్పీల్‌ను ఆశ్రయించగా తాజాగా షమీమా యూకేకు వచ్చేందుకు అనుమతినిచ్చింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ బేగం వల్ల జాతీయ భద్రతకు భంగం వాటిల్లుతుందనే వాదనతో పరిగణనలోకి తీసుకుంటాం. అయితే పౌరసత్వం విషయంలో స్పెషల్ ఇమ్మిగ్రేషన్ అప్పీల్స్ కమిషన్ ముందు హాజరై, అప్పీలు చేసుకోవడమే ఆమె ముందున్న ఏకైక మార్గం. కాబట్టి ఆమెను యూకేలో అడుగుపెట్టేందుకు అనుమతినివ్వాలి’’అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్టు చేసి, కేసు నమోదు చేయడం సహా విచారించవచ్చని తెలిపింది. అయితే ప్రభుత్వం మాత్రం కోర్టు తీర్పు తమను నిరాశకు గురిచేసిందని, ఈ విషయంపై అప్పీలుకు వెళ్తామని పేర్కొంది. ఇదిలా ఉండగా.. కోర్టు తనకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు అమలైనా ప్రస్తుత పరిస్థితుల్లో సిరియా నుంచి ఆమె యూకే చేరుకోవడం అసాధ్యంతో కూడుకున్న పనే. -
అమానుషం; షమీమా కొడుకు చనిపోయాడు..!
డమాస్కస్ : ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)లో చేరి ప్రస్తుతం సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్డీఎఫ్) రెఫ్యూజీ క్యాంపులో ఆశ్రయం పొందుతున్న బ్రిటన్ పౌరురాలు షమీమా బేగం కొడుకు మరణించాడని ఎస్డీఎఫ్ ప్రతినిధి తెలిపారు. నిమోనియా కారణంగా అతడు మృతిచెందినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె పౌరసత్వాన్ని రద్దు చేసి అమానుషంగా ప్రవర్తించారంటూ బ్రిటన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. 2015లో సిరియాకు పారిపోయి ఐఎస్‌లో చేరిన బంగ్లాదేశీ- బ్రిటీష్ టీనేజర్ షమీమా బేగం(19).. అక్కడే తన సహచరుడి(డచ్ పౌరుడు)ని పెళ్లి చేసుకుంది. ఐఎస్ ఉగ్రవాదులు ఏరివేతలో భాగంగా షమీమా భర్తను ఎస్డీఎఫ్ దళాలు అదుపులోకి తీసుకోవడంతో గర్భవతి అయిన తనను స్వదేశానికి తీసుకువెళ్లాలని.. బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది. అయితే షమీమా వల్ల పౌరుల భద్రతకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉన్నందని పేర్కొంటూ షమీమా పౌరసత్వాన్ని బ్రిటన్ ప్రభుత్వం రద్దు చేసింది.(చదవండి : పిక్నిక్కు వెళ్తున్నామని చెప్పి.. ప్రస్తుతం గర్భిణిగా!) ఈ నేపథ్యంలో తనతో పాటు షమీమాను కూడా నెదర్లాండ్‌కు తీసుకువెళ్లాలని ఆమె భర్త భావించాడు. అయితే అక్కడి చట్టాల ప్రకారం మైనర్‌ను పెళ్లి చేసుకుంటే వారి వివాహం చెల్లదనే అభిప్రాయాలు వ్యక్తమవడంతో షమీమా సిరియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇటీవలే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడికి జరా అని నామకరణం చేసింది. అయితే పౌష్టికాహారం లోపం వల్ల బలహీనంగా పుట్టిన అతడు ప్రస్తుతం నిమోనియాతో మరణించడంతో బ్రిటన్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక వ్యక్తికి ఆశ్రయం లేకుండా చేయడం నేరం. ఆమె పౌరసత్వాన్ని రద్దు చేయడం ద్వారా చిన్నారి చావుకు కారణమయ్యారు. ఇది చాలా అమానుష చర్య’ అని బ్రిటన్ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.(షమీమా సంచలన వ్యాఖ్యలు) ఈ విషయాలపై స్పందించిన బ్రిటన్ హోం శాఖ కార్యదర్శి జావీద్ మాట్లాడుతూ.. ‘ఇది నిజంగా విచారకరం. అయితే అక్కడి క్యాంపుల్లో చాలా మంది ఆశ్రయం పొందుతున్నారు. చనిపోయింది షమీమా కొడుకో కాదో తేలాల్సి ఉంది. ఉగ్రవాదం కారణంగా యుద్ధ జోన్లలో ఉన్న వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆ పిల్లాడి మరణాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదు’ అని హితవు పలికారు. కాగా కొన్ని రోజుల క్రితం.. షమీమా పౌరసత్వాన్ని రద్దు చేస్తామని ప్రకటించిన జావీద్.. ఆమెకు పుట్టబోయే బిడ్డ ఏనాటికీ బ్రిటీష్ పౌరుడు కాలేదని వ్యాఖ్యానించారు.(చదవండి : ఇంటికి వెళ్లాలని ఉంది) ఇక తమదేశంలో ఉన్న విదేశీ జీహాదీలను క్యాంపుల నుంచి తిరిగి తమ తమ దేశాలకు తీసుకువెళ్లాలంటూ ఎస్డీఎఫ్ పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేస్తోన్నసంగతి తెలిసిందే. అయితే ఐసిస్ సానుభూతి పరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఎస్డీఎఫ్ విఙ్ఞప్తిని మన్నించలేమని, గుర్తింపు పొందిన ఏదైనా ప్రభుత్వంలో ఈ విదేశీ జీహాదీలు భాగమైనపుడు మాత్రమే సహాయం చేసే అవకాశం ఉంటుందని పేర్కొంది. అదే విధంగా అమెరికా కూడా విదేశీ జీహాదీలను స్వదేశానికి తీసుకువచ్చినా సరే.. వారికి సరైన శిక్ష విధించాలనే దృఢచిత్తంతో ఉంది. అందుకే వివిధ దేశాలను ఇందుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను సమీక్షించాల్సిందిగా ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలో షమీమా వంటి సిరియా రెఫ్యూజీల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. -
తప్పు చేశానేమో.. షమీమా సంచలన వ్యాఖ్యలు..
ఢాకా : ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)లో చేరినందుకు పశ్చాత్తాప పడుతున్న తన కూతురిని వెంటనే స్వదేశానికి తీసుకురావాలంటూ అహ్మద్ అలీ అనే వ్యక్తి బ్రిటన్ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. బంగ్లాదేశీ- బ్రిటీష్ టీనేజర్ షమీమా బేగం(19).. 2015లో సిరియాకు పారిపోయి ఐఎస్‌లో చేరింది. అనంతరం అక్కడే తన సహచరుడిని పెళ్లి చేసుకుంది. గత కొంతకాలంగా సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్డీఎఫ్) బలపడటంతో.. ఐఎస్ ఉగ్రవాదులకు నిలువ నీడ లేకుండా పోతోంది. ఈ క్రమంలో షమీమా భర్తను ఎస్డీఎఫ్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం ఎస్డీఎఫ్ దళాల రెఫ్యూజీ క్యాంపులో ఆశ్రయం పొందుతున్న షమీమా ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సిరియాలో పరిస్థితులు బాగాలేని కారణంగా బిడ్డతో సహా, తనను బ్రిటన్‌కు తీసుకువెళ్లాలని మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కోరింది. ఈ క్రమంలో ఆమె వల్ల పౌరుల భద్రతకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉన్నందున షమీమా పౌరసత్వాన్ని రద్దు చేయాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తాను మీడియా ముందుకు వచ్చి తప్పు చేశానేమో అంటూ షమీమా సంచలన వ్యాఖ్యలు చేసింది.(పిక్నిక్కు వెళ్తున్నామని చెప్పి.. ప్రస్తుతం గర్భిణిగా!) కావాలంటే అక్కడే శిక్షించండి.. ఈ నేపథ్యంలో తన కూతురి భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేసిన షమీమా తండ్రి అహ్మద్ అలీ... ‘ షమీమా ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే తను బ్రిటీష్ పౌరురాలు. కాబట్టి ఆమెను స్వదేశానికి తీసుకురావాల్సిన బాధ్యత బ్రిటన్ ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ షమీమా తప్పు చేసి ఉంటే.. ఆమెని లండన్‌కు తీసుకువచ్చి అక్కడే శిక్షించండి. కానీ తన పౌరసత్వాన్ని రద్దు చేయడం సరైంది కాదు. తప్పు చేయని వారు ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా ఉండరు. సిరియా వెళ్లినపుడు తన వయస్సు 15 ఏళ్లు. తప్పుడు వ్యక్తుల ప్రభావంతో తను అలా చేసింది. చిన్న పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత మనదే. అందుకే తనను బ్రిటన్‌కు తీసుకురావాల్సిందే అని డిమాండ్ చేశారు. కాగా బ్రిటన్ నుంచి తిరిగివచ్చిన అహ్మద్ అలీ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నివసిస్తున్నారు. ఇక తమదేశంలో ఉన్న విదేశీ జీహాదీలను క్యాంపుల నుంచి తిరిగి తమ తమ దేశాలకు తీసుకువెళ్లాలంటూ ఎస్డీఎఫ్ పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేస్తోన్నసంగతి తెలిసిందే. అయితే ఐసిస్ సానుభూతి పరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఎస్డీఎఫ్ విఙ్ఞప్తిని మన్నించలేమని, గుర్తింపు పొందిన ఏదైనా ప్రభుత్వంలో ఈ విదేశీ జీహాదీలు భాగమైనపుడు మాత్రమే సహాయం చేసే అవకాశం ఉంటుందని పేర్కొంది. అదే విధంగా అమెరికా కూడా విదేశీ జీహాదీలను స్వదేశానికి తీసుకువచ్చినా సరే.. వారికి సరైన శిక్ష విధించాలనే దృఢచిత్తంతో ఉంది. అందుకే వివిధ దేశాలను ఇందుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను సమీక్షించాల్సిందిగా ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలో షమీమా వంటి సిరియా రెఫ్యూజీల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.(చదవండి : ఇంటికి వెళ్లాలని ఉంది) -
పిక్నిక్కు వెళ్తున్నామని చెప్పి.. ప్రస్తుతం గర్భిణిగా!
మొన్న లియోనారా... నేడు షమీమా బేగం.. సిరియాలోని డెమొక్రటిక్ క్యాంపుల్లో ఆవాసం పొందుతున్న.. ఇలాంటి ఇంకెందరో టీనేజర్లు స్వదేశానికి వెళ్లేందుకు ఆరాటపడుతున్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించాలంటే చట్టపరంగా, రాజకీయపరంగా ఎన్నో అవాంతరాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముస్లిం రాజ్య స్థాపనే ధ్యేయంగా సిరియా, ఇరాక్లలో నరమేధం సృష్టిస్తున్న ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్‌కు వీరు ఒకప్పటి సానుభూతి పరులు. తెలిసీ తెలియని వయస్సులో వేసిన తప్పటడుగు ఇప్పుడు వీరికి, వీరి సంతానానికి పెనుశాపంగా మారింది. వారిద్దరితో పాటు.. షమీమా బేగం బంగ్లాదేశీ- బ్రిటీష్ టీనేజర్(19). లండన్‌లోని బెత్నల్ గ్రీన్ అకాడమీలో చదువుకునేది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే షమీమా ఐఎస్ సిద్ధాంతాలు, వీడియోల పట్ల ఆకర్షితురాలై.. 2015లో తన తోటి విద్యార్థులు ఖతీజా సుల్తానా, అమైరా అబేస్‌లతో కలిసి లండన్ నుంచి సిరియాకు పారిపోయింది. ఈ విషయం అప్పట్లో లండన్ పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలిచింది. పిక్నిక్కి వెళ్తున్నామని చెప్పి పరారైన ఈ ముగ్గురు మొదట టర్కీకి వెళ్లి... అక్కడి నుంచి సిరియాలో ఐఎస్‌కు పట్టు ఉన్న రాకాకు చేరుకున్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఖతీజా ఐసిస్- కుర్దిష్ వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో చనిపోయింది. అమైరా ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు. ఈ క్రమంలో రాకా చేరిన పది రోజుల తర్వాత అక్కడే ఇస్లాం స్వీకరించిన ఓ డచ్ వ్యక్తి(27)ని షమీమా పెళ్లి చేసుకుంది. అప్పటిదాకా బాగానే గడిచిన ఆమె జీవితం పెళ్లి తర్వాత దుర్భరంగా మారింది. సరైన తిండిలేక, పోషకాహార లోపం వల్ల రెండుసార్లు గర్భవిచ్చిత్తి కావడంతో షమీమా ఆరోగ్యం క్షీణించింది. లండన్‌లో అయితే నా బిడ్డ భద్రంగా ఉంటుంది.. ఇదిలా ఉండగా ఐఎస్ నుంచి రాకాను స్వాధీనం చేసుకునేందుకు.. స్థానిక కుర్దిష్ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఐఎస్‌కు మద్దతుగా నిలుస్తున్న ‘జీహాదీ’ లను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా రాకాను స్వాధీనం చేసుకుని సగం విజయం సాధించాయి. ఈ క్రమంలో వేలాది మంది ఐఎస్ సానుభూతిపరుల కుటుంబాలకు నిలువ నీడ లేకుండా పోయింది. ఇదే అదనుగా దొరికిన వాళ్లను దొరికినట్టుగా అదుపులోకి తీసుకున్న సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్డీఎఫ్) వారిని క్యాంపులకు తరలించడం మొదలుపెట్టాయి. షమీమా కూడా వారికి చిక్కడం, ఆమె భర్తను ఎస్డీఎఫ్ దళాలు అదుపులోకి తీసుకోవడం జరిగిపోయాయి. ఈ విషయం గురించి షమీమా అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ... ‘ప్రస్తుతం నిండు గర్భిణిని. నాలుగేళ్ల క్రితంలా ఇప్పుడు నాది చిన్నపిల్లల మనస్తత్వం కాదు. బ్రిటన్ వెళ్తే కనీసం నాకు పుట్టబోయే బిడ్డ అయినా ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నరకబడిన ఓ మనిషి తలను మా డస్ట్‌బిన్‌లో మొదటిసారి చూసినపుడు నాకేమీ అనిపించలేదు. ఎందుకంటే ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆ వ్యక్తికి అదే సరైన శిక్ష అని భావించాను. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఐసిస్ ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది. వారిలో నిజాయితీ లేదు కాబట్టి ఓడిపోయేందుకు వారు అర్హులు. ఇక కాలిఫేట్(ఐసిస్ స్థాపించాలనుకున్న రాజ్యం పేరు) స్థాపన అసాధ్యం’ అని తన అనుభవాలను చెప్పుకొచ్చింది.(ఇంటికి వెళ్లాలని ఉంది) ఇక్కడకు తీసుకొచ్చి శిక్షిద్దాం.. తమదేశంలో ఉన్న విదేశీ జీహాదీలను ఈ క్యాంపు నుంచి తిరిగి తమ తమ దేశాలకు తీసుకువెళ్లాలంటూ ఎస్డీఎఫ్ పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది. అయితే ఐసిస్ సానుభూతి పరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఎస్డీఎఫ్ విఙ్ఞప్తిని మన్నించలేమని, గుర్తింపు పొందిన ఏదైనా ప్రభుత్వంలో ఈ విదేశీ జీహాదీలు భాగమైనపుడు మాత్రమే సహాయం చేసే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో బ్రిటన్‌కు తీసుకువచ్చిన తర్వాత.. ఐసిస్‌కు ఒకప్పుడు మద్దతుగా నిలిచిన కారణంగా షమీమా వంటి వారిని శిక్షించినా ఫర్వాలేదు గానీ.. వారికిప్పుడు కనీస సాయం అందించాల్సిన అవసరం ఉందని బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాల్లాస్ అభిప్రాయపడ్డారు. అదే విధంగా అమెరికా కూడా విదేశీ జీహాదీలను స్వదేశానికి తీసుకువచ్చినా సరే.. వారికి సరైన శిక్ష విధించాలనే దృఢచిత్తంతో ఉంది. అందుకే వివిధ దేశాలను ఇందుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను సమీక్షించాల్సిందిగా ఒత్తిడి చేస్తోంది. ఏదేమైనా టీనేజీ యువత పట్ల తల్లిదండ్రులు తగిన శ్రద్ధ కనబరచనట్లయితే లియోనారా, షమీమాలాగే మరికొంత మంది ఐఎస్ కబంధ హస్తాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ‘ఐఎస్’ ఎక్కడో కాకుండా ప్రేమ రూపంలోనో, డబ్బు ఆశ చూపిస్తూనో అది మన వీధిలోనే మన పిల్లల కోసం వల పట్టుకుని తిరుగుతుండవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది! -సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ -
‘అవును.. నేను పెద్ద తప్పే చేశాను.. కానీ ..’
ఇప్పుడు తెలుస్తోంది.. అవును ఇప్పుడే తెలుస్తోంది.. నేను పెద్ద తప్పు చేశాను... ఆ తప్పు దిద్దుకునే మార్గం కోసం రోజూ వెదుకుతూనే ఉన్నాను.. ఇంటికి వెళ్లాలని ఉంది.. పూర్వపు జీవితం గడపాలని ఉంది.. ఇది ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో భాగమైన ఓ జర్మన్ యువతి ఆవేదన. ఉగ్రవాదికి మూడో భార్యగా ఉంటూ 19 ఏళ్లకే ఇద్దరు పిల్లలకు తల్లిగా మారినందుకు తీరని వేదన అనుభవిస్తున్న ఆమె.. విముక్తి లభిస్తే స్వదేశానికి వెళ్తానంటూ పశ్చాత్తాపపడుతోంది. ఇస్లాం స్వీకరించి.. సిరియాకు పయనం లియోనారా జర్మనీకి చెందిన యువతి. పదిహేనేళ్ల ప్రాయంలో ఇస్లాం మతం స్వీకరించింది. ఆ తర్వాత అప్పటికే ఇద్దరు భార్యలు కలిగి ఉన్న జర్మన్ జీహాదిస్టు మార్టిన్ లెమ్కే(28) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అనంతరం అతడి కుటుంబంతో కలిసి సిరియాకు పారిపోయింది. అయితే... సిరియాను వశం చేసుకునేందుకు ఐఎస్ సాగిస్తున్న మారణకాండను కళ్లారా చూసేంతవరకు .. ఆ ఉగ్రమూక పట్ల ఆమెకు సానుభూత వైఖరే ఉండేది. కానీ ఎప్పుడైతే అంతర్యుద్ధంలో తన కుటుంబం భాగస్వామ్యమైందో అప్పుడే తాను ఎంత పెద్ద తప్పు చేశానన్న విషయం లియోనారాకు బోధపడింది. గృహిణిగానే ఉంది! భర్త, ఇద్దరు సవతులతో కలిసి లియోనారా మొదట ఐఎస్ రాజధాని రాకాలో నివాసం ఉండేది. ఆ సమయంలో భర్త తనను కేవలం ఒక పనిమనిషిగానే చూసేవాడు. వంట చేయడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, అందరికీ సపర్యలు చేయడం ఇదే ఆమె రోజూ వారీ దినచర్య. అలా నాలుగేళ్లుగా గృహిణిగా తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తున్న లియోనారా.. ఇద్దరు పిల్లలకు తల్లైంది. తన ఇంట్లో తానే ఓ పనిమనిషిలా కాలం వెళ్లదీసింది. వారానికో ఇంట్లో నివాసం.. బహిరంగ శిరచ్ఛేదనలు, అత్యాచారాలతో సిరియా ప్రజలకు భీతికొల్పుతున్న ఐఎస్ నుంచి రాకాను స్వాధీనం చేసుకునేందుకు... స్థానిక కుర్దిష్ వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. సిరియాలో ప్రజాస్వామ్య పాలనే లక్ష్యంగా... ఐఎస్‌కు మద్దతుగా నిలుస్తున్న ‘జీహాదీ’ లను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా రాకాను స్వాధీనం చేసుకుని సగం విజయం సాధించాయి. ఈ క్రమంలో వేలాది మంది ఐఎస్ సానుభూతిపరుల కుటుంబాలకు నిలువ నీడ లేకుండా పోయింది. ఇదే అదునుగా దొరికిన వాళ్లను దొరికినట్టుగా అదుపులోకి తీసుకున్న సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్డీఎఫ్) వారిని క్యాంపులకు తరలించడం మొదలుపెట్టాయి. అంతేకాకుండా తమ దేశంలో ఉన్న విదేశీ జీహాదీలను ఈ క్యాంపు నుంచి తిరిగి స్వదేశానికి తీసుకువెళ్లాలంటూ పశ్చిమ దేశాలకు విఙ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎస్డీఎఫ్ నుంచి తప్పించుకునేందుకు లియోనారా కుటుంబం వారానికో ఇంట్లో తలదాచుకునేది. అయితే ఆ సమయంలో ఐఎస్ వీరి గురించి పట్టించుకునేది కాదు. ఐఎస్ గురించి పూర్తిగా తెలిసిన తర్వాత వారి కంటే కుర్దిష్ దళాలే నయమని భావించిన లియోనార భర్త, ఇద్దరు పిల్లలు, భర్త రెండో భార్యతో కలిసి ఎస్డీఎఫ్ క్యాంపునకు బయల్దేరింది. ఇందులో భాగంగా ఇరాక్ సరిహద్దులోని బాగోజ్ గ్రామానికి చేరుకుంది. అయితే తూర్పు సిరియాలో గస్తీ కాస్తున్న అమెరికా మద్దతు దేశాల బలగాలు లియోనారా భర్త మార్టిన్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నాయి. నా భర్త టెక్నీషియన్ మాత్రమే..కాదు ఉగ్రవాది! ‘నా భర్త కంప్యూటర్లు రిపేర్ చేసేవాడు. అదే విధంగా కంప్యూటర్ విడిభాగాలు, ఫోన్లు ఐఎస్‌కు సరఫరా చేసేవాడని మాత్రమే నాకు తెలుసు. రాకాను కోల్పోయిన ఐఎస్ మమ్మల్ని పూర్తిగా వదిలించుకోవాలని చూసింది. తినడానికి తిండి ఉండేది కాదు. పిల్లలు ఆకలితో అలమటిస్తుంటే అలా చూస్తూ ఉండటం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. టీనేజ్‌లో నేను చేసిన తప్పు నా పిల్లల పాలిట శాపంగా మారుతుందని ఊహించలేకపోయాను.ఇప్పుడు నా సొంత ఇంటికి వెళ్లాలని ఉంది’ అంటూ లియోనారా తన పరిస్థితి గురించి అంతర్జాతీయ మీడియా ముందు మొరపెట్టుకుంటోంది. అయితే లియోనారా భర్త ఐఎస్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించే వాడని, వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి అతడే సూత్రధారి అని జర్మన్ మీడియా అంటోంది. ఏదేమైనప్పటికీ లియోనారా గనుక నిజంగా పశ్చాత్తాపడితే మాత్రం ఆమెను స్వదేశానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించాల్సి ఉంటుందని మానవ హక్కుల కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. టీనేజీ యువత పట్ల తల్లిదండ్రులు తగిన శ్రద్ధ కనబరచనట్లైతే లియోనారా లాగే మరికొంత మంది ఐఎస్ కబంధ హస్తాల్లో చిక్కుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 3200 మంది నిజంగా జిహాదీలేనా? గతేడాది డిసెంబరు నాటికి సుమారు 36 వేల మందిపై దాడి చేసిన ఎస్డీఎఫ్.. ఓ చిన్నపాటి క్యాంపులో వారిని ఉంచి ఇబ్బందులకు గురిచేస్తోందని బ్రిటన్‌కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆరోపిస్తోంది. ఇందులో 3200 మందిని జీహాదీలుగా భావించి వారిని నిర్బంధించిందనే వాదన కూడా వినిపిస్తోంది. -
ఐసిస్ అబద్ధం.. యూఎస్ దాడితో భారీ నష్టమే
న్యూయార్క్: అమెరికా అతిపెద్ద బాంబుతో చేసిన దాడి వృధా కాలేదని స్పష్టమైంది. దాదాపు 90 మందికిపైగా ఉగ్రవాదులు ఈ బాంబు దాడిలో హతమయ్యారని అప్ఘనిస్థాన్ ప్రభుత్వం శనివారం అధికారికంగా ప్రకటించింది. పెద్ద మొత్తంలో ఇస్లామిక్ స్టేట్ దెబ్బతిందని కూడా పేర్కొంది. అమెరికాలోని అతిపెద్ద బాంబుగా పేర్కొన్న జీబీయూ-43/బీ (ఎంఓఏబీ)ని అప్ఘనిస్థాన్‌లోని నంగర్హార్ ప్రావిన్స్‌లోగల ఐసిస్ సొరంగ బంకర్లపై వేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 36 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తొలుత వార్తలు రాగా.. అసలు తమకు ఎలాంటి నష్టం జరగలేదని, ఒక్క ఉగ్రవాది కూడా చనిపోలేదని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. దీంతో అమెరికా ప్రయత్నం విఫలమైందా అని మీడియాలో చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ బాంబు దాడికి సంబంధించి తాజాగ అఫ్ఘనిస్థాన్ అధికారిక ప్రతినిధి అచ్చిన్ జిల్లా గవర్నర్ ఇస్మాయిల్ షిన్వారి మీడియాకు ప్రకటన విడుదల చేశారు. దాదాపు 92మంది ఐసిస్ ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలిపారు. అయితే, ఈ దాడిలో తమ సైనికులకుగానీ, సామాన్యులకు గానీ ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. అయితే, గతంలో ఈ బాంబు దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలోనే సామాన్య పౌరులు కూడా ఉండేవారని, ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్త పరిణామాల కారణంగా వారంతా ఆ ప్రాంతాలను విడిచి వెళ్లారని వివరించారు. ఈ కారణంగానే పెద్ద ప్రమాదం తప్పినట్లయిందని అభిప్రాయపడ్డారు.