లండన్: ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)లో చేరి ప్రస్తుతం సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్‌డీఎఫ్) రెఫ్యూజీ క్యాంపులో ఆశ్రయం పొందుతున్న షమీమా బేగం ఎట్టకేలకు యూకేలో అడుగుపెట్టనుంది. తన పౌరసత్వాన్ని రద్దు చేసిన బ్రిటన్ ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్ధంకానుంది. ఈ మేరకు యూకే కోర్టు(కోర్ట్ ఆఫ్ అప్పీల్) గురువారం షమీమాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఉత్తర సిరియాలో ఆశ్రయం పొందుతున్న ఆమె స్వదేశానికి తిరిగి వచ్చేందుకు, స్పెషల్ ఇమ్మిగ్రేషన్స్ అప్పీల్స్ కమిషన్ ముందు పౌరసత్వం గురించి తన వాదన వినిపించేందుకు అర్హురాలేనని స్పష్టం చేసిందని స్థానిక మీడియా పేర్కొంది.
ఈ విషయంపై స్పందించిన యూకే ప్రభుత్వం జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా షమీమా పౌరసత్వం పునరుద్ధరించలేమని, ఆమెను దేశంలో అడుగుపెట్టేందుకు అనుమతించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. కోర్టు తీర్పు తమను నిరాశకు గురిచేసిందని, అప్పీలుకు వెళ్లేందుకు అనుమతి కోరుతామని హోం ఆఫీస్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. (చదవండి : పిక్‌నిక్‌కు వెళ్తున్నామని చెప్పి.. గర్భిణిగా!)
అసలేం జరిగిందంటే... బంగ్లాదేశ్- బ్రిటీష్ పౌరసత్వం కలిగిన షమీమా బేగం(20).. లండన్‌లోని బెత్నల్ గ్రీన్ అకాడమీలో చదువుకునేది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆమె ఐఎస్ సిద్ధాంతాలు, వీడియోల పట్ల ఆకర్షితురాలై.. పదిహేనేళ్ల వయసులో 2015లో తన తోటి విద్యార్థులు ఖతీజా సుల్తానా, అమైరా అబేస్‌లతో కలిసి లండన్ నుంచి సిరియాకు పారిపోయింది. పిక్‌నిక్‌కి వెళ్తున్నామని చెప్పి పరారైన వీరు మొదట టర్కీకి వెళ్లి... అక్కడి నుంచి సిరియాలో ఐఎస్‌కు పట్టు ఉన్న రాకాకు చేరుకున్నారు. ఈ క్రమంలో రాకా చేరిన పది రోజుల తర్వాత అక్కడే ఇస్లాం స్వీకరించిన ఓ డచ్ వ్యక్తి(27)ని షమీమా పెళ్లి చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఆమె జీవితం తలకిందులైంది. సరైన తిండిలేక, పోషకాహార లోపం వల్ల రెండుసార్లు గర్భవిచ్చిత్తి కావడంతో శారీరంగా బలహీనపడిపోయింది.(‘నా కూతురిని బ్రిటన్‌కు తీసుకురావాల్సిందే..’)
నన్ను రానివ్వండి ప్లీజ్..
ఈ నేపథ్యంలో ఐఎస్ నుంచి రాకాను స్వాధీనం చేసుకునే క్రమంలో స్థానిక కుర్దిష్ వర్గాలు ఐఎస్‌కు మద్దతుగా నిలుస్తున్న ‘జీహాదీ’ లను ఏరివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయం సాధించాయి. దొరికిన వాళ్లను దొరికినట్టుగా అదుపులోకి తీసుకున్న సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్‌డీఎఫ్) వారిని క్యాంపులకు తరలించడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో 2019లో షమీమా కూడా వారికి చిక్కడం, ఆమె భర్తను ఎస్‌డీఎఫ్ దళాలు అదుపులోకి తీసుకోవడం జరిగిపోయాయి. అయితే అప్పటికే నిండు గర్భిణిగా ఉన్న ఆమె శరణార్థి శిబిరంలోకి చేరుకుంది.
అప్పటికే పూర్తిగా నీరసించిన పోయిన షమీమా.. తప్పు తెలుసుకున్నానని, ఐసిస్ ఓడిపోతోందని, కాబట్టి తనకు పుట్టబోయే అయినా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నానంటూ అంతర్జాతీయ మీడియా వేదికగా తనను బ్రిటన్ వచ్చేందుకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆమె అభ్యర్థనను తిరస్కరించిన బ్రిటన్.. తమ పౌరుల భద్రతా కారణాల దృష్ట్యా పౌరసత్వాన్ని కూడా రద్దు చేస్తున్నామని గతేడాది ఫిబ్రవరిలో ప్రకటించింది. కాగా అప్పటికే షమీమాకు పుట్టిన బిడ్డ నిమోనియాతో మరణించడంతో ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
షమీమాను అరెస్టు చేయవచ్చు!
ఇక పౌరసత్వ విషయంపై షమీమా తరఫున ఆమె లాయర్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా.. ఆమెకు బ్రిటీష్- బంగ్లాదేశ్ ద్వంద్వ పౌరసత్వాలు ఉన్నందున ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోర్ట్ ఆఫ్ అప్పీల్‌ను ఆశ్రయించగా తాజాగా షమీమా యూకేకు వచ్చేందుకు అనుమతినిచ్చింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ బేగం వల్ల జాతీయ భద్రతకు భంగం వాటిల్లుతుందనే వాదనతో పరిగణనలోకి తీసుకుంటాం.
అయితే పౌరసత్వం విషయంలో స్పెషల్ ఇమ్మిగ్రేషన్ అప్పీల్స్ కమిషన్ ముందు హాజరై, అప్పీలు చేసుకోవడమే ఆమె ముందున్న ఏకైక మార్గం. కాబట్టి ఆమెను యూకేలో అడుగుపెట్టేందుకు అనుమతినివ్వాలి’’అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్టు చేసి, కేసు నమోదు చేయడం సహా విచారించవచ్చని తెలిపింది. అయితే ప్రభుత్వం మాత్రం కోర్టు తీర్పు తమను నిరాశకు గురిచేసిందని, ఈ విషయంపై అప్పీలుకు వెళ్తామని పేర్కొంది. ఇదిలా ఉండగా.. కోర్టు తనకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు అమలైనా ప్రస్తుత పరిస్థితుల్లో సిరియా నుంచి ఆమె యూకే చేరుకోవడం అసాధ్యంతో కూడుకున్న పనే.
Comments
Please login to add a commentAdd a comment