
ఒబామా.. నా ప్రేయసిని ముట్టుకోవద్దు!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. షికాగోలో ఓటు వేయడానికి ఆయన వెళ్లినప్పుడు.. అక్కడో వ్యక్తి ఆయన్ను ఆపాడు. 'మిస్టర్ ఒబామా.. నా ప్రేయసిని ముట్టుకోవద్దు' అన్నాడు. దాంతో ఒబామాతో పాటు.. సదరు ప్రేయసి కూడా ఒక్క నిమిషం షాక్ తిన్నారు. తీరా చూస్తే.. అతగాడు సరదాగా అన్నట్లు తర్వాత తీరిగ్గా చెప్పాడు.
విషయం ఏమిటంటే, షికాగోలో ఓటువేయడానికి ఒబామా వెళ్లినప్పుడు, ఆయన ఆయా కూపర్ అనే మహిళ తర్వాత నిల్చున్నారు. సరదాగా అధ్యక్షుడితో మాట్లాడాలని కూపర్ ప్రియుడు మైక్ జోన్స్కు అనిపించింది. అందుకే ఆ మాట అన్నాడు. అసలు అధ్యక్షుడు తనతో పాటు ఓటు వేయడానికి వచ్చారనగానే తొలుత ఆమె కొంత ఉద్వేగానికి గురైంది. అంతలో ప్రియుడు ఈ మాట అనడంతో షాకయ్యింది. తర్వాత విషయం తెలిసి అంతా రిలాక్సయ్యారు. తనకు మిషెల్ను ఒకసారి కలవాలని ఉందని కూపర్ చెప్పింది. తన ప్రియుడు చేసిన పనికి ఆమె ఒబామాకు క్షమాపణ చెప్పింది. అయితే ఒబామా కూడా దీన్ని చాలా తేలిగ్గా తీసుకుని, కూపర్కు ఓ చిన్నపాటి కౌగిలి, ముద్దు ఇచ్చారు. ఆయన తనను కేవలం బుగ్గమీదే ముద్దు పెట్టుకున్నారని, అందువల్ల మిషెల్ దీని గురించి ఏమీ అనుకోవద్దని ఆమె తెలిపింది. ఇప్పుడు నీ ప్రియుడు నిజంగా అసూయ పడతాడని కూపర్తో ఒబామా అన్నారు.