'అమ్మ' కానికి పిల్లలు... భారీ డిస్కౌంట్
ఫేస్బుక్లో ఏ వస్తువు అయినా అమ్మకానికి పెడితే... రెప్పపాటులో అమ్ముడవుతున్నాయి కదా అని తన చిన్నారుల ఇద్దరిని విక్రయానికి పెట్టింది ఓ కన్నతల్లి. అంతేకాకుండా సదరు చిన్నారులను కారులో కూర్చోబెట్టి.... చేతులు బుడిదరంగు ప్లాస్టర్తో కట్టేయడమే కాకుండా... వారి నోటికి కూడా ప్లాస్టర్ వేసింది.... దీంతో ఆ చిన్నారుల కన్నీళ్లుతో ఉన్న ఆ ఫోటోలను ఫేస్బుక్లో పెట్టింది.
అక్కడితో ఆగకుండా పిల్లలు 'బ్యాడ్'... కావున 45 శాతం డిస్కొంట్తో ప్రత్యేక ఆఫర్లో విక్రయిస్తున్నాం.... ఆలస్యం చేస్తే ఆశాభంగం మాత్రం తప్పదని పేర్కొంటూ శుక్రవారం ఫేస్బుక్లో తల్లి జైబేబీ ఫోస్ట్ చేసింది. సదరు చిన్నారుల ఫోటోలు ఫేస్బుక్లో హల్చల్ సృష్టిస్తున్నాయి. అవి కాస్తా యూఎస్ మెంపిస్లోని టేనస్సీ పోలీసు ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లడంతో ... వారు అలర్ట్ అయ్యారు. దీనిపై విచారణ చేపట్టారు... ఆ విచారణ కొనసాగుతోంది.
కాగా ఈ చిన్నారుల విక్రయానికి సంబంధించిన ఫోటో పోస్టింగ్పై పలువురు తల్లిదండ్రులు ఫేస్బుక్లో తీవ్రంగా స్పందించారు. ఇది చాలా దుర్మార్గం... పెద్ద నేరం కూడా.. ఈ ఫోటో చూసిన తర్వాత శ్వాస తీసుకోవడం కూడా మేము మర్చిపోయాము... ఈ ఫోటో చూసి చాలా భావోద్వేగానికి లోనయ్యామన్నారు. వాళ్లు మనుషులేగా ... అదీ చిన్నారులంటూ వారు పిల్లల తల్లి జైబేబీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో ఈ పోటో పోస్ట్ చేసిన జైబేబి కుటుంబం ఆలోచనలో పడింది. వెంటనే ఆమె బంధువు డిరియన్ కింగ్ వివరణ ఇచ్చారు. ఈ ఫోటో ప్రాక్టికల్ జోక్ మాత్రమే అంటూ సర్థిచెప్పారు. మా ఇంట్లోని చిన్నారులను తమ కుటుంబమే కాదు స్నేహితులు అందరు ఎంతో ప్రేమగా చూస్తారంటూ పేర్కొన్నారు. కానీ జైబేబి కుటుంబంపై ఆరోపణలు మరింత వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ నుంచి ఆ ఫోటోను జైబేబి తొలగించింది.