USA: టోర్నడో ఎగరేసుకుపోయినా... చెక్కుచెదరలేదు! | USA: Four-month-old baby sucked up by Tornado found alive on tree | Sakshi
Sakshi News home page

USA: టోర్నడో ఎగరేసుకుపోయినా... చెక్కుచెదరలేదు!

Published Mon, Dec 18 2023 4:22 AM | Last Updated on Mon, Dec 18 2023 8:34 AM

USA: Four-month-old baby sucked up by Tornado found alive on tree - Sakshi

అమెరికాలోని టెన్నెసీలో గత వారం ఓ అద్భుతమే జరిగింది. రెండు భయానక టోర్నడోలు రాష్ట్రాన్ని నిలువునా వణికించాయి. ఓ చిన్నారితో సహా ఆరుగురు వాటి బారిన పడి దుర్మరణం పాలయ్యారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎన్నో ఆస్తులు ధ్వంసమయ్యాయి.

కానీ భయానకమైన అంతటి టోర్నడోలో అమాంతం గాల్లోకెగిసి ఏకంగా 30 అడుగుల దూరం ఎగిరిపోయిన ఓ నాలుగు నెలల బుడతడు మాత్రం చెక్కు చెదరలేదు! అంతటి ప్రమాదం నుంచి నిక్షేపంగా బయటపడి ఔరా అనిపించాడు. సినిమాల్లోనే కని్పంచే అద్భుతం తమ జీవితంలో నిజంగా జరిగిందంటూ అతని తల్లిదండ్రులు దేవునికి దండం పెట్టుకుంటున్నారు.

ఇలా జరిగింది..
సిడ్నీ మూర్‌ (22), అరామిస్‌ యంగ్‌బ్లడ్‌ (39) దంపతులది టెన్నెసీలోని క్లార్క్స్‌విల్లే. మొబైల్‌ వ్యాన్లోనే నివాసం. వారికిద్దరు కొడుకులు. పెద్దవాడు ప్రిన్స్‌టన్‌కు ఏడాది కాగా రెండో వాడు లార్డ్‌కు నాలుగు నెలలు. గత శనివారం హఠాత్తుగా టోర్నడో (భారీ సుడిగాలి) క్లార్క్స్‌విల్లేను కకావికలు చేసి పారేసింది. స్థానిక అధికార యంత్రాంగం టోర్నడో సైరన్‌ ఇవ్వకముందే వారి మొబైల్‌ వ్యాన్‌పై విరుచుకుపడింది.

చూస్తుండగానే పైకప్పును లేపేసింది. దాంతో మూర్‌ హుటాహుటిన ప్రిన్స్‌టన్‌ను హృదయానికి హత్తుకుని నేలకు కరుచుకుపోయింది. ఊయలలో నిద్రిస్తున్న లార్డ్‌ను కాపాడేందుకు తండ్రి పరుగులు తీశాడు. అప్పటికే ఆ చిన్నారిని టోర్నడో అమాంతంగా ఎగరేసుకుపోయింది. సుడిగాలి, అందులో అప్పటికే చిక్కిన అనేకానేక శిథిలాల మధ్య పాపం పసివాడు సుడులు తిరుగుతూ కొట్టుకుపోయాడు. ఆ వెంటనే మొబైల్‌ వ్యాన్‌ పూర్తిగా నేలమట్టమైంది.

హోరు గాలులు, వాటిని మించిన జోరు వానతో పరిస్థితి భీతావహంగా తయారైంది. శిథిలాల్లోంచి పెద్ద కొడుకుతో పాటుగా మూర్‌ పాక్కుంటూ సురక్షితంగా బయటికి రాగలిగింది. కానీ పసివాడితో పాటు అతన్ని కాపాడబోయిన తండ్రి సైతం సుడిగాలి దెబ్బకు కొంత దూరం ఎగిరిపడ్డాడు. అంతెత్తు నుంచి అమాంతంగా కిందపడి భుజం విరగ్గొట్టుకున్నాడు. అంతటి నొప్పితోనే బాబు కోసం 10 నిమిషాల పాటు శిథిలాల దిబ్బలన్నీ ఆత్రంగా వెదికాడు.

చివరికి 30 అడుగుల దూరంలో పడిపోయిన చెట్టు కింద చిన్నారి లార్డ్‌ గుక్కపట్టి ఏడుస్తూ కని్పంచాడు. అంత దూరం ఎగిరిపోయి అమాంతంగా కింద పడ్డా గాయాలు కాకపోవడం విశేషం. ఇదంతా ఏదో సినిమాలో సన్నివేశంలా తోస్తోందంటూ జరిగిన భయానక ఘటనను మూర్‌ గుర్తు చేసుకుంది. ‘‘హోరు వానలో జారిపోయిన భుజంతో నిలువెల్లా తడిసి చేతుల్లో మా చిన్న కొడుకుతో నా భర్త తిరిగొస్తున్న దృశ్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’’ అంటూ హర్షాతిరేకాలు వెలిబుచ్చింది.

టెన్నెసీలో అంతే...
టెన్నెసీ రాష్ట్రం అమెరికాలో భారీ టోర్నడోలకు పెట్టింది పేరు. గత శనివారం గంటకు ఏకంగా 125 మైళ్ల వేగంతో కూడిన గాలులు, భారీ వర్షంతో విరుచుకుపడ్డ టోర్నడోలు పెను విధ్వంసమే సృష్టించాయి. వాటిలో ఒక టోర్నడో అయితే మాంట్‌గొమరీ కౌంటీ నుంచి లొగాన్‌ కౌంటీ దాకా ఏకంగా 43 మైళ్ల దూరం ప్రయాణించింది. దారిపొడవునా సర్వాన్నీ తుడిచిపెట్టేసింది.    

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement