దుష్ట సిద్ధాంతాన్ని నాశనం చేయాలి
⇒ ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ ఐక్యంగా పోరాడాలి: ట్రంప్
⇒ మాంచెస్టర్ ఉగ్రదాడిని ఖండించిన ప్రపంచ నేతలు
లండన్/బెత్లెహామ్: అమా యక ప్రజలను బలిగొన్న బ్రిటన్‌లోని మాంచెస్టర్‌పై ఉగ్రదాడిని ప్రపంచ నేతలు, ప్రముఖులు తీవ్రంగా ఖండిం చారు. పాప్‌స్టార్ అరియానా గ్రాండే ప్రదర్శన సమయంలో వేదిక వద్ద జరిగిన ఈ ఆత్మాహుతి బాంబు దాడి మృతులకు పాలస్తీనా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘దుష్ట సిద్ధాంతాన్ని సర్వనాశనం చేయాలి. అమాయక ప్రజలకు రక్షణ కల్పించి తీరాలి.
మన పౌరుల పవిత్ర హక్కయిన శాంతిభద్రతలను కాపాడేందుకు నాగరిక దేశాలన్నీ ఒక్కటి కావాలి’అని ట్రంప్ తన సందేశంలో పేర్కొన్నారు. బ్రిటన్ ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియల్ మాక్రాన్... ‘మనం ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాటం చేస్తున్నాం’అన్నారు.
ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: మాంచెస్టర్ ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ‘మాంచెస్టర్ దాడి వార్త విని ఎంతో బాధపడ్డా. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
సిగ్గుమాలిన చర్య: పుతిన్
‘ఈ సిగ్గుమాలిన, అమానవీయ చర్యను ఖండిస్తున్నాం. దీనికి బాధ్యులైనవారు శిక్ష నుంచి తప్పించుకోరని ఆశిస్తున్నా’అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. మాంచెస్టర్ ఘటనతో గుండె పగిలిందని, ఇలాంటి కిరాతకాలకు పాల్పడేవారిని తుదముట్టించాలన్న సంకల్పాన్ని మరింత ధృఢం చేసిందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు జీన్‌క్లాడే జుంకర్ అన్నారు. ‘యువతను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడి అత్యంత కిరాతకం’అని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడితో దిగ్భ్రాంతి కలిగించిందని కెనడా, జపాన్‌ల ప్రధానమంత్రులు జస్టిన్ ట్రుడ్యూ, షిన్జో అబే అన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో బ్రిటిషర్లకు చైనా ప్రజలు మద్దతుగా ఉంటారని ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్ చెప్పారు.
సోనియా, రాహుల్ దిగ్భ్రాంతి..
మాంచెస్టర్ దాడిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్య క్షుడు రాహుల్‌గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘సరిహద్దులు చెరిపేసి, మతాలకతీతంగా ప్రపంచమంతా ఒక్కటై ఉగ్రవాద భూతంపై పోరాడాలి’అని సోనియా తన సందేశంలో పేర్కొన్నారు.
గుండె పగిలింది: అరియానా
తన కార్యక్రమంలో జరిగిన ఈ దాడిపై పాప్ సింగర్ అరియానా గ్రాండె దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ‘గుండె పగిలింది. నన్ను క్షమించండి. మాటలు రావడం లేదు’అంటూ కన్నీటి పర్యంతమ య్యారు. ‘అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఆ ఘటన తలుచుకుంటుంటే కన్నీళ్లు ఉబుకుతున్నాయి’ అని గాయని, నటి డెమి లావాటో బాధను వ్యక్తం చేశారు. ‘మాంచె స్టర్ బాధితుల కోసం ప్రార్థిస్తున్నా. మరణించిన వారికి కన్నీటి వీడ్కోలు’అంటూ సెలెనో గోమెజ్, టేలర్ స్విఫ్ట్, బీబర్, జాన్ లెజండ్ బాధను పంచుకున్నారు. ‘ఇలాంటి హేయమైన చర్యల కు సమాధానం అందరం చేతులు కలిపి ప్రేమను పంచడ మొక్క టే’అని ఆస్కార్ పొందిన గాయకుడు శాంస్మిత్ అన్నారు.