ప్రణబ్, మోదీ అభినందనలు | Narendra Modi, Pranab Mukherjee congratulate Donald Trump | Sakshi
Sakshi News home page

ప్రణబ్, మోదీ అభినందనలు

Published Thu, Nov 10 2016 2:18 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

ప్రణబ్, మోదీ అభినందనలు - Sakshi

ప్రణబ్, మోదీ అభినందనలు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై న డొనాల్డ్ ట్రంప్‌కు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రపంచ దేశాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా కూడా అభినందించారు. ట్రంప్ ఎన్నిక భారత్-అమెరికా సంబంధాల్లో ‘కొత్త శకానికి నాంది’గా రాష్ట్రపతి ప్రణబ్ అభివర్ణించారు. ట్రంప్‌కు మోదీ ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు.  అమెరికాతో సంబంధాలను శిఖరస్థాయికి తీసుకెళ్తామని ట్వీట్ చేశారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతాయని భారత సంతతికి చెందిన అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ పేర్కొన్నారు.
 
 రష్యా అధ్యక్షుడు పుతిన్.. ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. రష్యా పార్లమెంటూ అభినందనలు తెలిపింది. ఇరుదేశాల సంబంధాలు అభివృద్ధి పథంలో సాగేందుకు మా వంతు కృషి మేం చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ట్రంప్‌కు పంపిన టెలిగ్రామ్ సందేశంలో పుతిన్ పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే ట్రంప్‌కు శుభాకాంక్షలు చెబుతూ అమెరికా, బ్రిటన్ సంబంధాలు ప్రత్యేకమైనవని.. వ్యాపార, రక్షణ, నిఘా వ్యవహారాల్లో సన్నిహిత భాగస్వాములుగా వ్యవహరిస్తామని అన్నారు.
 
  తమ ఉద్యోగాలను చైనీయులు లాగేసుకుంటున్నారని ఆరోపించిన ట్రంప్ విజయంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆచితూచి స్పందించారు. ట్రంప్‌కు అభినందనలు చెబుతూ అతనితో కలసి పనిచేయడానికి సిద్ధమన్నారు. విశ్వశాంతికి సహకరించాల్సిందిగా కోరారు. ట్రంప్ విజయంతో అనిశ్చితి ఏర్పడుతుందన్న ఫ్రాన్‌‌స అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ కూడా ట్రంప్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ట్రంప్ మధ్య తూర్పు దేశాల్లో స్థిరత్వాన్ని తీసుకువస్తాడని ఆశిస్తున్నానని సౌదీ రాజు సాల్మన్ అభిప్రాయపడ్డారు. కాగా ట్రంప్ విజయం నేపథ్యంలో హిందూ సేన ఢిల్లీలో సంబరాలు చేసుకుంది. డమ్స్ వాయిస్తూ మిఠాయిలు పంచిపెట్టారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement