బ్రిస్బేన్: మహాత్ముడి బోధనలు ఇప్పటికీ అనుసరణీయమేనని ప్రపంచ దేశాలకు ప్రధాని మోదీ సూచించారు. ఉగ్రవాదం, గ్లోబల్‌వార్మింగ్ వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు గాంధీ చూపిన అహింసా, ప్రేమ మార్గాలే చక్కని పరిష్కారమన్నారు. జీ20 సమావేశం నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని ఆదివారం ఇక్కడి క్వీన్స్‌లాండ్ రాష్ర్ట రాజధాని బ్రిస్బేన్‌లో మహాత్ముడి భారీ కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు. 28 ఏళ్ల క్రితం రాజీవ్‌గాంధీ పర్యటించిన తర్వాత ఆస్ట్రేలియాకు వచ్చిన భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. ఈ నేపథ్యంలో స్థానిక రోమా స్ట్రీట్ పార్క్‌లో గాంధీజీ నిలువెత్తు విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. జీ-20 సదస్సు ముగిసిన తర్వాత ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు.
ఆయన వేదికపైకి రాగానే అప్పటికే అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్న భారతీయ ఆస్ట్రేలియన్లు చేతులూపుతూ కేరింతలతో అభినందనలు తెలిపారు. ఢిల్లీకి చెందిన శిల్పి రామ్ సత్తర్ తీర్చిదిద్దిన 8 అడుగుల ఎత్తున్న గాంధీ విగ్రహాన్ని క్వీన్స్‌లాండ్ గవర్నర్, మేయర్ సమక్షంలో కరతాళధ్వనుల మధ్య మోదీ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఇరుదేశాల మధ్య సంబంధాలకు, ఆకాంక్షలకు ఈ విగ్రహం చిరునామాగా నిలుస్తుందని అభివర్ణించారు. తర్వాత మోదీ గౌరవార్థం క్వీన్స్‌లాండ్ ప్రధాని క్యాంప్‌బెల్ న్యూమన్ విందు ఇచ్చారు. ఎన్‌ఆర్‌ఐలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
నగరాల మధ్య బంధం దృఢపడాలి
ఈ సందర్భంగా ఇంగ్లీష్‌లో ప్రసంగించిన మోదీ.. ఆస్ట్రేలియా, భారత్ మధ్య దృఢమైన బంధం ఉందని పేర్కొన్నారు. ఇది మరింత బలోపేతం కావాలంటే ఇరు దేశాల్లోని రాష్ట్రాలు, నగరాలు ఇంకా దగ్గరకావాల్సిన అవసరముందన్నారు. ‘అడ్వాన్స్‌డ్ టెక్నాలజీకి కేంద్రంగా బ్రిస్బేన్ అవతరించింది. అదే సమయంలో హైదరాబాద్ కూడా సైబరాబాద్‌గా పేరుపొందింది. సహజంగానే ఈ రెండింటి మధ్య సోదర నగరాల బంధం ఏర్పడుతుంది’ అని అన్నారు. తన పర్యటనలో కుదుర్చుకునే ఒప్పందాల్లో భారత్‌లోని రాష్ట్రాలకు భాగస్వామ్యం కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మోదీ చెప్పారు. ఇరు దేశాల సంబంధాల్లో క్వీన్స్‌లాండ్‌కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. టెక్నాలజీ నుంచి వనరులపై పరిశోధనల వరకు భారత్-క్వీన్స్‌లాండ్ మధ్య బంధాలు కొనసాగుతున్నాయన్నారు. ఈ ఏడాది క్వీన్స్‌లాండ్‌కు చెందిన ఎన్నో వాణిజ్య ప్రతినిధుల బృందాలు భారత్‌ను దర్శించనున్నాయని, భారత పెట్టుబడులకు కూడా క్వీన్స్‌లాండ్ అత్యంత అనుకూలంగా ఉందన్నారు.