ఏడు గ్రహాల మరో ప్రపంచం! | NASA trappist-1 over Seven Planets | Sakshi
Sakshi News home page

ఏడు గ్రహాల మరో ప్రపంచం!

Published Fri, Feb 24 2017 3:34 AM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM

గ్రహ వ్యవస్థ ఊహా చిత్రం,  గ్రహవ్యవస్థపై నాసా సిద్ధం చేసిన ఓ పోస్టర్‌

గ్రహ వ్యవస్థ ఊహా చిత్రం, గ్రహవ్యవస్థపై నాసా సిద్ధం చేసిన ఓ పోస్టర్‌

‘‘మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది’’ అని శ్రీరంగం శ్రీనివాసరావు అప్పుడెప్పుడో గట్టిగానే పిలుపునిచ్చాడుగానీ.. ఆ ప్రపంచం ఇప్పటికీ వాస్తవం కాలేదు. ఈలోపు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు మాత్రం.. మరో ప్రపంచాన్ని మాత్రమే కాదు. ఏకంగా ఇంకో సౌర కుటుంబాన్నే ఆవిష్కరించారు. ఆ... ఏముందిలే గొప్ప... సౌర కుటుంబానికి ఆవల ఇప్పటికే ఒకట్రెండు వేల గ్రహాలను గుర్తించాం కదా... అందులో ఓ తొమ్మిదింటిలో జీవం ఉండేందుకు అవసరమైన పరిస్థితులు ఉన్నాయని కూడా తెలుసుకదా అంటున్నారా? నిజమే కానీ.. తాజాగా గుర్తించిన గ్రహ వ్యవస్థ నిజంగానే కొంచెం స్పెషల్‌. ఒక్కటొక్కటే తెలుసుకుందాం... అన్నింటికంటే ముఖ్యంగా ఈ సౌర కుటుంబంలోని మొత్తం ఏడు గ్రహాలు కొంచెం అటుఇటుగా భూమి సైజులోనే ఉండటం ఒక విశేషం. పైగా వీటిల్లో కనీసం ఆరింటిపై మన భూమి మాదిరిగానే రాళ్లు, రప్పలు ఉన్నాయి.

మొత్తం ఏడు గ్రహాల్లో  మూడు ‘గోల్డీలాక్‌’ జోన్‌లో ఉన్నాయి. అంటే... ఈ మూడు గ్రహాలు తమ సూర్యుడి నుంచి మరీ దూరంగా కాకుండా (చల్లగా ఉండకుండా) మరీ దగ్గరగానూ లేకుండా (ఎండవేడికి కరిగి పోకుండా) ఉన్నాయన్నమాట. దీనివల్ల ఈ మూడు గ్రహాల్లోనూ భారీ సైజున్న మహా సముద్రాలు ఉండే అవకాశముంది. నీరు ఉన్న చోట జీవం ఉండేందుకు కూడా అవకాశాలు ఎక్కువన్న విషయం తెలిసిందే. ఇక ఈ గ్రహ వ్యవస్థ తాలూకూ నక్షత్రం గురించి చూద్దాం. పేరు ట్రాపిస్ట్‌ –1. ఇదో రెడ్‌డ్వార్ఫ్‌. అంటే.. మన సూర్యుడి కంటే ఎన్నోరెట్లు తక్కువ సైజులో ఉండే నక్షత్రం. అలాగే దీన్నుంచి వెలువడే కిరణాల తీవ్రత కూడా తక్కువే. అంతా బాగుంది కానీ... ఎంత దూరం ఉందో ఈ వ్యవస్థ అని ఆలోచిస్తున్నారా? ఎంత జస్ట్‌ 39 కాంతి సంవత్సరాల దూరం మాత్రమే!

ఇప్పుడు అందుబాటులో ఉన్న రాకెట్లను వాడితే ఈ గ్రహాలను చేరుకునేందుకు కొన్ని వందల కోట్ల సంవత్సరాలు పడుతుంది! అయితే భూమికి అవతల జీవం ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్న గ్రహ వ్యవస్థ ఇదే అంటూండటం ఈ ఆవిష్కరణకు ప్రాధాన్యం లభిస్తోంది. అంతేకాదు.. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, కొత్త కొత్త టెలిస్కోపులు అందుబాటులోకి వస్తున్న తరుణంలో ఈ కొత్త గ్రహ వ్యవస్థ తాలూకూ వివరాలు మరింత క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఎక్కువ సమయం కూడా పట్టకపోవచ్చు. ట్రాపిస్ట్‌–1 చుట్టూ తిరుగుతున్న ఏడు గ్రహాలకు ట్రాపిస్ట్‌ –1ఏ, 1బీ... 1హెచ్‌ అని పేర్లు పెట్టారు. ఈ గ్రహ వ్యవస్థలో ఇప్పటివరకూ కనిపించని మరో గ్రహం కూడా ఉండే అవకాశం ఉందని, దీన్ని ట్రాపిస్ట్‌–ఎక్స్‌ అని పిలుస్తున్నామని నాసా అంటోంది.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement