స్ప్రే ద్వారా.. మెదడుకు మందులు!
జబ్బు చేస్తే సాధారణంగా మందులు తీసుకోవాలి. వాటిని మాత్రలుగా లేదా సూదిమందుగా ఎలాగైనా తీసుకోవచ్చు. అయితే ముక్కులోకి పిచికారి చేయడం ద్వారా కూడా ఔషధాలను ఇవ్వొచ్చంటున్నారు డెన్మార్క్ శాస్త్రవేత్తలు. మెదడు వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మందులను ముక్కులోకి స్ప్రే చేయడం ద్వారా సమర్థంగా అందించడం భవిష్యత్తులో సాధ్యం కానుందని వారు అంటున్నారు. ప్రస్తుతం మెదడుకు వ్యాధులు వచ్చినప్పుడు మాత్రలు లేదా ఇంజెక్షన్ల ద్వారా ఇచ్చే మందులు మెదడును చేరడం, సమర్థంగా పనిచేయడంలో విఫలమవుతున్నాయి.
అదే ముక్కు ద్వారా ఔషధాలు ఇస్తే గనక అవి మెదడును సమర్థంగా చేరతాయని యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ డెన్మార్క్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మెదడు మందులను మాత్రల ద్వారా దీర్ఘకాలం ఇస్తే.. మిగతా శరీర భాగాలకు అనవసరమైన మందులను ఎక్కువగా ఇచ్చినట్టేనని, అందుకే ఈ కొత్త పద్ధతిపై తాము దృష్టిపెట్టామని వర్సిటీ ప్రొఫెసర్ డీ కాగ్నో వెల్లడించారు. ముక్కు గోడల ద్వారా మెదడును చేరగలిగే ఓ సహజ చక్కెర అణువును తాము గుర్తించామని, ఈ అణువు ఔషధాలను మెదడుకు తీసుకెళ్లడమే కాకుండా.. అవసరమైనచోటే మందును విడుదల చేస్తుందని పేర్కొన్నారు.