మరోసారి మోదీ, షరీఫ్ భేటీ!
ఇస్లామాబాద్: భారత్, పాకిస్థాన్ ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ లు మరోసారి భేటీకానున్నట్లు తెలిసింది. గత డిసెంబర్ లో మోదీ ఆకస్మిక లాహోర్ పర్యటనతో వేగం పుంజుకుని, జనవరిలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడితో శాంతి చర్చలు అర్థంతరంగా నిలిచిపోయిన నేపథ్యంలో ఈ ఇరువురి కలయికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వాషింగ్టన్ వేదికగా మార్చి మాసాంతంలో ప్రారంభం కానున్న ప్రపంచ అణుసదస్సులో ఇరుదేశాల ప్రధానులు ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం ఉంటుందని విశ్వసనీయంగా తెలిసింది. రెండు రోజుల పాటు జరిగే అణు సదస్సు(మార్చి 31, ఏప్రిల్ 1)కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వం వహిస్తారు. ఈ తరహా సదస్సుకు దాయాది దేశాల ప్రధానులు ఇద్దరూ హాజరుకావటం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ప్రపంచ దేశాల అణుకార్యక్రమాలు, పర్యవసానాలు, అణుశక్తి వినియోగం తదితర అంశాలపై ఈ సదస్సులో పలు తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉంది. కాగా, మోదీ పర్యటనపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అటు పాక్ అధికారులు మాత్రం ఇద్దరి భేటీ ఖాయమంటున్నారు. అయితే భారత్- పాక్ చర్చల ప్రక్రియ ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఊహించడం అసాధ్యమని పరిశీలకుల భావన.