మారుపేరుతో అంత్యక్రియలు! | Nethaji Funeral | Sakshi
Sakshi News home page

మారుపేరుతో అంత్యక్రియలు!

Published Fri, Jan 22 2016 3:42 AM | Last Updated on Sat, Oct 20 2018 7:32 PM

మారుపేరుతో అంత్యక్రియలు! - Sakshi

మారుపేరుతో అంత్యక్రియలు!

* 1945 ఆగస్టు 22న తైపీలో నేతాజీ భౌతికకాయానికి దహనసంస్కారం
* ఇచిరో ఒకురా అనే పేరుతో మరణ ధ్రువీకరణ పత్రం ఇచ్చిన జపాన్
* నాటి తైపీ అధికారి సాక్ష్యం ఇచ్చిన పత్రాలు విడుదల చేసిన బోస్‌ఫైల్స్ వెబ్‌సైట్

లండన్: నేతాజీ సుభాష్‌చంద్రబోస్ చివరి రోజుల వివరాలను క్రోడీకరించేందుకు ఏర్పాటు చేసిన బ్రిటన్ వెబ్‌సైట్ బోస్‌ఫైల్స్. ఇన్ఫో.. నేతాజీ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు తాను ఏర్పాట్లు చేసినట్లు చెప్తూ తైవాన్ అధికారి ఒకరు ఇచ్చిన సాక్ష్యాన్ని విడుదల చేసింది. దాని ప్రకారం.. నేతాజీ భౌతికకాయానికి 1945 ఆగస్టు 22వ తేదీన తైవాన్ రాజధాని తైపీ నగరంలో ‘ఇచిరో ఒకురా’ అనే పేరు రిజిస్టరు చేసి అంత్యక్రియలు నిర్వహించారు.

భారత స్వాతంత్య్ర పోరాటయోధుడు బోస్.. 1945 ఆగస్టు 18వ తేదీన తైపీ శివార్లలోని ఒక వైమానిక కేంద్రంలో విమానప్రమాదంలో చనిపోయినట్లు పలు విచారణ నివేదికలను ఉటంకిస్తూ ఈ వెబ్‌సైట్ కొన్ని పత్రాలను బహిరంగ పరచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విడుదల చేస్తున్న చివరి పత్రాల్లో భాగంగా.. బ్రిటన్ విదేశాంగ కార్యాలయంలో.. ఎఫ్‌సీ1852/6 ఫైల్ నంబరుతో ఉన్న తైవాన్ అధికారి సాక్ష్యం పత్రాన్ని తాజాగా వెబ్‌సైట్‌లో ప్రచురించింది.

1956 సంవత్సరానికి చెందిన ఈ పత్రం ప్రకారం.. 1945 ఆగస్టు 22వ తేదీన బోస్ అంత్యక్రియలు జరిగాయని.. నాడు తైపీ నగరంలో అంత్యక్రియల అనుమతులను జారీ చేసే అధికారి టాన్ టి-టి సాక్ష్యం ఇచ్చారు. అయితే.. అంతకుముందు రోజు అంటే 1945 ఆగస్టు 21వ తేదీన ఇచిరో ఒకురా అనే పేరుతో ఉన్న మరణ ధ్రువీకరణ పత్రాన్ని.. బోస్ భౌతికకాయంతో పాటు వచ్చిన జపాన్ సైనికాధికారి ఒకరు తైపీ అధికారులకు సమర్పించారు.

మరుసటి రోజు ఆగస్టు 22వ తేదీన.. భౌతికకాయంతో వచ్చిన సదరు జపాన్ అధికారి.. అది భారత నాయకుడు (కమాండర్) బోస్‌దని, ఆయన ఒక ముఖ్యమైన పని మీద టోక్యో వెళుతుండగా విమాన ప్రమాదానికి గురై గాయపడ్డట్లు చెప్పారని టి-టి వాంగ్మూలం ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సైనిక మృతుల బంధువులు అందుబాటులో లేనపుడు సైనిక ఆస్పత్రి ఇచ్చే మరణ ధ్రువీకరణ పత్రం ఆధారంగా అంత్యక్రియలకు అనుమతి ఇవ్వటం జరిగేదని తైవాన్ ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది.

ఈమేరకు.. ఇచిరో ఒకురా అనే పేరును మునిసిపల్ హెల్త్ సెంటర్ రిజిస్టరులో నమోదు చేసి బోస్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించినట్లు భావిస్తున్నారు. ఆగస్టు 22వ తేదీన జపాన్ అధికారి, ఒక భారతీయుడితో కలిసి కారులో ఒక శవపేటికలో భౌతికకాయంతో వచ్చారని టి-టి పేర్కొన్నారు. ఆ శవపేటికను టోక్యోకు తీసుకువెళ్లాలనేది తొలుత ఉద్దేశం కాగా.. అప్పటికి అంత పెద్ద పెట్టె పట్టే విమానాలు లేకపోవటంతో భౌతికకాయానికి తైపీలోనే అంత్యక్రియలు నిర్వహించినట్లు వివరించాడు. సదరు జపాన్ సైనికాధికారితో పాటు వచ్చిన భారతీయుడు బోస్ సహాయకుడు కల్నల్ హబీబుర్ రెహ్మాన్‌గా భావిస్తున్నారు.

అంత్యక్రియలు పూర్తయిన మరుసటి రోజు.. అంటే ఆగస్టు 23వ తేదీన జపాన్ సైనికాధికారి, రెహ్మాన్‌లు ఇద్దరూ వచ్చి బోస్ అస్తికలను తీసుకెళ్లినట్లు టి-టి చెప్పారు. బోస్‌తో పాటు విమానప్రమాదంలో గాయపడి ప్రాణాలతో బయటపడ్డ కల్నల్ రెహ్మాన్ 1945 ఆగస్టు 24న ఇచ్చిన సాక్ష్యం కూడా ఇలాగే ఉంది. జపాన్ సైనికాధికారుల ఏర్పాట్లతో బోస్ భౌతికకాయానికి తైహోకు (తైపీకి జపాన్ భాషలో పేరు)లో 1945 ఆగస్టు 22న అంత్యక్రియలు నిర్వహించటం జరిగిందని, ఆ మరుసటి రోజు అస్తికలను తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. బోస్‌ఫైల్స్ విడుదల చేసిన పత్రాలు విశ్వసనీయమైనవేనని తాను భావిస్తున్నట్లు నేతాజీ కుమార్తె ప్రొఫెసర్ అనితా ఫాఫ్ పేర్కొన్నారు.
 
రేపు భారత రహస్య పత్రాల విడుదల...
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి భారత ప్రభుత్వం వద్ద ఉన్న కొన్ని రహస్య పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బోస్ జన్మదినమైన ఈ నెల 23వ తేదీన (శనివారం) బహిర్గతం చేయనున్నారు. ఈ నేపథ్యంలో జరిగే కార్యక్రమానికి బోస్ కుటుంబ సభ్యులు, కొందరు నాయకులు హాజరవుతారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ గురువారం తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement