భారత్-పాక్ సంబంధాలపై నవాజ్ షరీఫ్
నవాజ్‌తో భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్ భేటీ
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్-పాక్ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలు కావాల్సిన అవసరం ఉందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఇరుదేశాల కొన్నేళ్లుగా నలుగుతున్న సమస్యలను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. సార్క్ దేశాల యాత్రలో భాగంగా మంగళవారం పాక్ వెళ్లిన భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్.. నవాజ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. ‘‘పొరుగుదేశాలతో మంచి సంబంధాలు నెలకొల్పాలి. భారత్-పాక్‌లోని ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. రెండు దేశాలు కలిసి నడవాలి. సహకార భావం నెలకొనాలి. దేశ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు కృషి చేయాలి’’ అని ఆయన పేర్కొన్నారు. అపారమైన వనరులున్నా సమస్యలు, ఉద్రిక్తతల వల్ల దక్షిణాసియా ప్రాంతం ఎంతో నష్టపోయిందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాసిన లేఖను జైశంకర్.. నవాజ్ షరీఫ్‌కు అందజేశారు. అంతకుముందు జైశంకర్.. పాక్ విదేశాంగ కార్యదర్శి అజీజ్ చౌదరితో సమావేశమై చర్చలు జరిపారు. దీంతో ఏడు నెలల విరామం అనంతరం భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. దాదాపు గంటపాటు సాగిన వీరి భేటీలో జైశంకర్ ముంబై దాడులతో సహా ఉగ్రవాదం అంశాన్ని లేవనెత్తారు. పొరుగు దేశాలతో భారత్ సత్సంబంధాలను కోరుకుంటోందని చెప్పారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్‌తో కూడా జైశంకర్ సమావేశమయ్యారు. చర్చలపై ఇరుపక్షాలు సంతృప్తి వ్యక్తంచేశాయి. సార్క్ యాత్రలో భాగంగా జైశంకర్ ఇప్పటికే భూటాన్, బంగ్లాదేశ్ వె ళ్లారు. మంగళవారం ఇస్లామాబాద్ నుంచి బయల్దేరి అఫ్గానిస్థాన్‌కు వెళ్లనున్నారు.
'కొత్త అధ్యాయం మొదలవ్వాలి'
Published Wed, Mar 4 2015 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM
Advertisement
Advertisement