ఇక బ్రెయిన్ స్ట్రోక్‌లకు భయం లేదు
ఇక బ్రెయిన్ స్ట్రోక్‌లకు భయం లేదు
Published Wed, Apr 12 2017 5:24 PM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM
లండన్: వైద్య విజ్ఞానరంగంలో విప్లవాత్మక మార్పులు వేగంగా వస్తున్నాయి. ఆంజియోగ్రామీ ద్వారా గుండెనాళాల్లోని రక్తపు గడ్డలను శుద్ధి చేసినట్లుగా మెదడు నరాల్లోని బ్లడ్ క్లాట్లను ఇక సులభంగానే తొలగించవచ్చు. కొత్తగా కనుగొన్న ఈ విధానాన్ని వైద్య పరిభాషలో 'మెకానికల్ త్రోంబెక్టమీస్' అని వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో అనుభవజ్ఞులైన కొంత మంది న్యూరాలజిస్టులు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
ఈ విధానంలో రక్తం గడ్డగట్టిన మెదడు రక్తనాళంలోకి కాథెరిన్ (మెత్తటి గొట్టం లాంటి పరికరం) పంపిస్తారు. అనంతరం అందులోకి స్టెంట్ లేదా వైర్ మెష్‌ను పంపిస్తారు. అది రక్తం గడ్డకట్టిన ప్రాంతానికి వెళ్లిన తర్వాత మెష్ విస్తరించిన గడ్డ కట్టిన రక్తాన్ని శుభ్రం చేస్తుంది. అనంతరం కాథెరిన్ నుంచి స్టెంట్ లేదా వైర్ మెష్‌ను తొలగిస్తారు. సాధారణంగా అనస్థిషియా బదులు సెడిషన్ (మత్తించే మందులు) డ్రగ్స్ ఇచ్చి ఈ వైద్య ప్రక్రియను చేపడుతున్నారు. రక్తాన్ని పలుచపరిచే మందుల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన రోగులు 30 శాతం కోలుకుంటుంటే ఈ 'మెకానికల్ త్రోంబెక్టమీస్' వల్ల 80, 90 శాతం కోలుకునే అవకాశం ఉందని లండన్ వైద్యులు చెబుతున్నారు.
రంగ్బీ మ్యాచ్‌లో గాయపడి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన కార్నర్ లైన్స్ అనే 14 ఏళ్ల బాలుడికి మాట, కాళ్లు, చేతులు పడిపోవడంతో ఆ బాలుడికి 2015, మార్చి నెలలోనే ఈ కొత్త విధానం ద్వారా బ్లడ్ కాట్స్‌ను తొలగించారు. అనతికాలంలోనే కోలుకున్న ఆ బాలుడికి మాటతో సహా అన్ని అవయవాలు యథావిధిగా పనిచేస్తున్నాయి. ఈ విధానం ప్రస్తుతానికి లండన్‌లోని సెంట్ జార్జి ఆస్పత్రి సహా 24 న్యూరోసైన్స్ సెంటర్లకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఈ విధానాన్ని ప్రోత్సహించడం కోసం నేషనల్ హెల్త్ స్కీమ్ ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి.
ఈ ప్రతిపాదనలను త్వరలోనే ఆమోదిస్తామని, వీటి వల్ల వచ్చే ఏడాది నుంచి కనీసం వెయ్యి మంది రోగులకు ఇలాంటి చికిత్స అందించవచ్చని భావిస్తున్నామని సీఈవో సైమన్ స్టీవెన్స్ తెలిపారు. ఇంగ్లండ్‌ను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో బ్రెయిన్ స్ట్రోక్స్ ఒకటి. చనిపోతున్న వారిలో నాలుగొంతుల మంది చావుకు బ్రెయిన్ స్ట్రోక్ కారణమవుతోంది. ఈ కారణంగా ఏడాదికి ఎన్‌హెచ్‌ఎస్‌పై 300 కోట్ల పౌండ్ల భారం పడుతోంది. మెకానికల్ త్రోంబెక్టమీస్ తరహాలోనే ఇప్పుడిప్పుడే గుండె రక్తనాళాల్లో పేరుకుపోయిన బ్లడ్ క్లాట్స్‌ను తొలగిస్తున్నారు.
Advertisement
Advertisement