పాక్ ‘ఉగ్ర’ బ్యాంకుపై అమెరికా దెబ్బ!
న్యూయార్క్/కరాచీ: పాకిస్తాన్‌కు అమెరికా మరోసారి షాకిచ్చింది. కరాచీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హబీబ్ బ్యాంక్ లిమిటెడ్(హెచ్‌బీఎల్) న్యూయార్క్ శాఖను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. అక్రమ నగదు చెలామణి, ఉగ్రవాదులకు నిధుల మళ్లింపు, అక్రమ లావాదేవీల కట్టడికి నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ఆర్థిక సేవల విభాగం(డీఎఫ్‌ఎస్) తెలిపింది. దీంతో పాటు హబీబ్ బ్యాంకుపై 225 మిలియన్ డాలర్ల(రూ.14,385 కోట్లు) జరిమానా విధిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మొత్తాన్ని 14 రోజుల్లోపు చెల్లించాలని పేర్కొంది.
2006 ఒప్పందం ప్రకారం లోపాలను సరిదిద్దుకోవడానికి పలు అవకాశాలు ఇచ్చినప్పటికి హబీబ్ బ్యాంకు వాటిని వినియోగించుకోలేదని డీఎఫ్‌ఎస్ సూపరింటెండెంట్ మారియా వుల్లో తెలిపారు. న్యూయార్క్ శాఖ లైసెన్స్‌ను వెనక్కు ఇవ్వడానికి హబీబ్ బ్యాంక్ అంగీకరించినట్లు మారియా వెల్లడించారు. తొలుత ఈ బ్యాంకుపై 630 మిలియన్ డాలర్ల జరిమానా విధించాలని నిర్ణయించినప్పటికీ తర్వాత తగ్గించినట్లు పేర్కొన్నారు. 225 మిలియన్ డాలర్ల చెల్లింపుతో తమపై ఆరోపణలన్నీ తొలగిపోతాయని హబీబ్ బ్యాంకు ఉన్నతాధికారి తెలిపారు.