అలాంటివి మహిళలకే డేంజర్!
లండన్: మానవ జీవిత చక్రంలో నిద్ర అనేది అత్యంత ముఖ్యమైనది. శారీరక విశ్రాంతి కన్నా మానసిక విశ్రాంతి అత్యంత ముఖ్యం. ఈ విశ్రాంతికి భంగం కలిగిందో ఇక అంతే సంగతులు. నిద్రాభంగం జరిగితే పురుషులకన్నా స్త్రీలకే ఎక్కువ ఇబ్బందులు తలెత్తుతాయని, వారికే తొందరగా ప్రమాదం జరుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. రాత్రి వేళ షిప్టుల్లో పనిచేసే పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా దుష్ప్రభావాలు చవిచూడాల్సి ఉంటుందని ఆ అధ్యయనం వెల్లడించింది.
24 గంటల జీవ క్రియలో సర్కాడియల్ ప్రభావం పురుషుల మెదడుపై కన్నా స్త్రీలపైనే ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. 'మొట్టమొదటిసారి సర్కాడియన్ క్లాక్ ఎఫెక్ట్స్ పురుషుల్లో స్త్రీలలో వేర్వేరుగా ఉండటం మేం తొలిసారి గుర్తించాం. షిప్టుల్లో పనిచేసేవాళ్లలో ఈ వైరుద్యాన్ని మేం స్పష్టంగా గుర్తించాం. నైట్ షిప్టులో ఉన్న మహిళలపై ఒత్తిడి స్థాయి అధికంగా ఉంటుంది' అని యూనివర్సిటీ ఆఫ్ సర్రే అధ్యయనకారుల్లో ఒకరైన నయనతార శాంతి అన్నారు. సరిగా నిద్ర భంగం జరిగితే మానసిక నైపుణ్యాలు, మోటారు వాహనాల నియంత్రణ, జ్ఞాపక శక్తి తగ్గిపోతుందని, ఈ పరిస్థితి మహిళల్లో తొందరగ కలుగుతుందని తెలిపింది.