వాషింగ్టన్: మానవాళి మనుగడను ప్రమాదంలోకి నెట్టిన మహమ్మారి కరోనా సృష్టిస్తున్న అలజడి కారణంగా అమెరికా- చైనాల మధ్య తలెత్తిన మాటల యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. ప్రాణాంతక వైరస్ ప్రపంచమంతా విస్తరించడానికి చైనానే కారణమంటూ అమెరికా ఆరోపిస్తుండగా.. అమెరికా వల్లే ఈ దుస్థితి దాపురించిందని చైనా ఎదురుదాడికి దిగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనాను చైనీస్ వైరస్ అని సంబోధించడం సహా చైనా వెల్లడిస్తున్న కరోనా గణాంకాలపై అనుమానం వ్యక్తం చేస్తుండటంతో అధికార రిపబ్లికన్లు కూడా అదే పంథాను అనుసరిస్తున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీపై విమర్శల పర్వానికి తెరలేపారు. దీంతో కరోనా సంక్షోభం క్రమక్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది.(కరోనా: ‘చైనా నమ్మదగ్గ భాగస్వామి కాదు’)
ఇక తాజాగా ఐరాసలో అమెరికా మాజీ రాయబారి, భారత సంతతి నాయకురాలు నిక్కీ హేలీ సైతం చైనాపై వాగ్యుద్ధానికి దిగారు. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలపై చైనా చెప్పే లెక్కలను నమ్మలేమని అనుమానాలు వ్యక్తం చేశారు. బీజింగ్ గణాంకాలను నమ్మకూడదంటూ అమెరికా సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ శ్వేతసౌధ వర్గాలకు సూచించడాన్ని సమర్థించారు. ఈ మేరకు... ‘‘1.5 బిలియన్ జనాభా ఉన్న చైనాలో కేవలం 82,000 వేల కరోనా కేసులు, 3300 మరణాలు మాత్రమే సంభవించాయి. ఇవి కచ్చితంగా నిజమైన లెక్కలు కావు’’ అని ఆమె ట్వీట్ చేశారు. చైనాకు ప్రపంచ దేశాల సంక్షేమం కంటే కూడా తమ పరువే ముఖ్యమని.. అందుకే వైరస్‌పై గోప్యత పాటించిందని విమర్శించారు. తమ దేశంలో పుట్టిన వైరస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలకు సహాయం చేయడం కంటే చైనాకు పేరు ప్రఖ్యాతులపైనే ఎక్కువ దృష్టి ఉందని దుయ్యబట్టారు. (‘93 వేల మంది ప్రాణాలకు ముప్పు’)
కాగా చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ గణాంకాల ప్రకారం బుధవారం నాటికి అక్కడ 81,589 కరోనా బాధితులు ఉండగా... 3318 మంది మృత్యువాతపడ్డారు. ఇక అమెరికాలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. జాన్ హ్యాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం అగ్రరాజ్యంలో 236339 కరోనా కేసులు నమోదు కాగా.. 5 వేల మందికి పైగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది కరోనా బారిన పడగా... 51,485 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. (చిగురుటాకులా వణికిపోతున్న అమెరికా)
Comments
Please login to add a commentAdd a comment