అంగారకుడిపై నీటిమేఘాలు!
అరుణగ్రహంపై జీవం ఆనవాళ్ల కోసం అన్వేషణ సాగిస్తున్న క్యూరియాసిటీ శోధక నౌక తొలిసారిగా తలపెకైత్తి అక్కడి ఆకాశాన్ని కూడా ఇటీవల క్లిక్‌మనిపించిందట. అక్కడి ఆకాశంలో బాగా ఎత్తులో గాలుల తాకిడికి కొట్టుకుపోతున్న నీటిమేఘాల ఫొటోలను భూమికి కూడా పంపిందట. దీంతో అంగారకుడిపై ఒకప్పుడు జీవుల మనుగడకు అనుకూలమైన వాతావరణం ఉండేదన్న వాదనకు బలం చేకూర్చే మరో ఆధారం దొరికినట్లైందని అ మెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. వాతావరణంలో మంచు స్ఫటికాలు పోగు కావడం వల్ల లేదా బాగా చల్లబడిన నీటి బిందువులు చేరడం వల్ల ఆ మేఘాలు ఏర్పడి ఉంటాయని వారు భావిస్తున్నారు.
గతంలో మార్స్ వాతావరణంలో మేఘాలు దట్టంగా ఆవరించి ఉండేవని, అప్పుడు భూతాపోన్నతి వల్ల మార్స్ ఉపరితలం జీవులకు అనుకూలమైనంత వెచ్చగా ఉండేదని శాస్త్రవేత్తల అంచనా. ఇప్పటిదాకా అంగారకుడిపై మట్టి, శిలలపై లేజర్‌ను ప్రయోగించి వాటిలోని మూలకాలను, ఖనిజాలను విశ్లేషించిన క్యూరియాసిటీ మేఘాలను సైతం తన కెమెరాలో బంధించిందని, ఈ మేఘాలపై అధ్యయనం ద్వారా అక్కడి వాతావరణాన్ని మరింత బాగా అర్థం చేసుకునేందుకు వీలు కానుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.