అధ్యక్షుడు జాకబ్ జుమా, అజయ్, అతుల్, రాజేష్ (ఫైల్)
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని ప్రముఖ వాణిజ్య సంస్థలకు అధిపతులైన గుప్తాల కుటుంబంలోని ఓ కీలక వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాతో సన్నిహిత సంబంధాలున్న గుప్తాల ఇళ్లపై పోలీసు దాడులు జరిగాయి.
దక్షిణాఫ్రికాలోని ఫ్రీస్టేట్ ప్రావిన్సులో ఉన్న వ్రెడె అనే పట్టణంలో పాల ఉత్పత్తి కేంద్రం నుంచి పేదలకు చెందాల్సిన కోట్ల రూపాయల డబ్బును అధ్యక్షుడి అండతో గుప్తా సోదరులు అక్రమ పద్ధతుల్లో కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు విషయమై జొహన్నెస్‌బర్గ్ శివారు ప్రాంతమైన శాక్సన్‌వల్డ్‌లో ఉన్న వారి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేయగా వారిలో ఒకరు గుప్తా కుటుంబంలోని వ్యక్తి ఉన్నారు. జాకబ్ జుమాను పదవి నుంచి దిగిపొమ్మని ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్‌సీ) పార్టీ కోరడానికి కూడా గుప్తాలతో ఉన్న సంబంధాలే కారణమని తెలుస్తోంది.
జాకబ్ జుమాపై అవిశ్వాసం!
అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి జాకబ్ జుమాకు ఏఎన్‌సీ బుధవారం సాయంత్రం (నిన్న) వరకు గుడువిచ్చింది. ఆయన రాజీనామా చేయకపోతే పార్లమెంటులో గురువారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతా మంది. రాజీనామా చేయాల్సిందిగా ఇప్పటికే జుమాను ఏఎన్‌సీ కోరగా ఆయన అందుకు నిరాకరిస్తున్నారు. ఏఎన్‌సీ నిర్ణయాన్ని తానెప్పుడూ ధిక్కరించలేదనీ, కానీ తనను ఎందుకు తొలగించాలనుకుంటున్నారో, తాను చేసిన తప్పేంటో ఎవరూ చెప్పడం లేదని జుమా అన్నారు.
ఎవరీ గుప్తాలు?
జాకబ్ జుమాను తమ గుప్పెట్లో పెట్టుకుని రాజ్యాంగాధికారాలు సైతం చెలాయించిన గుప్తా సోదరుల ప్రయాణం ఉత్తరప్రదేశ్ నుంచి మొదలైంది. యూపీ లోని సహారాన్‌పూర్‌కు చెందిన శాండ్‌స్టోన్ వ్యాపారి శివ్‌కుమార్ గుప్తాకు అజయ్, అతుల్, రాజేష్ ‘టోనీ’ గుప్తా అనే ముగ్గురు కొడుకులున్నారు. వీరు 1993లో జొహన్నెస్‌బర్గ్‌లో అడుగుబెట్టి విశాల వాణిజ్య సామ్రాజ్యం నిర్మించారు.
కంప్యూటర్లు, వాటి విడిభాగాల వ్యాపారంతో ప్రారంభించి మీడియా, యురేనియం, బొగ్గు గనులు, రియల్ ఎస్టేట్, లోహాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల వరకూ విస్తరించారు. అడ్డగోలుగా వ్యాపా రాలు చేశారు. 2009లో దేశాధ్యక్షుడైన జుమాకు అత్యంత సన్నిహితులుగా మారి న గుప్తాలు.. పాలకపక్షమైన ఏఎన్‌సీని సైతం తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నారు.
ఊరి పేరుతో తొలి కంపెనీ..
గుప్తా సోదరులు తాము పుట్టి పెరిగిన సహారాన్‌పూర్ పేరు మీదుగా జొహన్నెస్ బర్గ్‌లో మొదటగా ‘సహారా కంప్యూట ర్స్’ను స్థాపించారు. ఇతర వ్యాపారాలకు విస్తరించాక 20 ఏళ్లలో అపర కుబేరుల య్యారు. 2013లో వారి సమీప బంధువు అనిల్ గుప్తా కూతురు పెళ్లికి చేసిన భారీ ఖర్చుతో వారి పేర్లు మార్మోగిపోయాయి. ఈ పెళ్లికి ఇండియా నుంచి 217 మంది అతిథులతో వచ్చిన విమానాన్ని వైమానికదళ స్థావరంలో దిగడానికి అనుమతించడంతో గుప్తాలు జుమాతో ఉన్న బంధాన్ని ఎలా వాడుకుంటున్నారో బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment