కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు
లాస్ వెగాస్ : అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ బిగ్ డిబేట్ లో పాల్గొన్నప్పటికీ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. ఈసారి కూడా వీరిద్దరూ మర్యాదపూర్వకంగా కూడా కరచలనం చేసుకోలేదు. బుధవారం రాత్రి(భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం) హిల్లరీ, ట్రంప్‌ల మూడో, చివరి డిబేట్ లాస్ వెగాస్‌లోని నెవాడా విశ్వవిద్యాలయంలో జరిగింది.
ఆఖరి డిబెట్లో భాగంగా డెమక్రటిక్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులుగా రేసులో ఉన్న హిల్లరీ, ట్రంప్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోకుండానే తమ ప్రసంగాలు ప్రారంభించటం విశేషం. కనీసం ప్రత్యర్థులు ఇద్దరూ చిరునవ్వు కూడా నవ్వలేదు. బిగ్ డిబెట్ ముగిసినా తర్వాత కూడా వాళ్లిద్దరూ కరచలనం చేసుకోలేదు సరికదా, ఒకరి వైపు మరొకరు చూడను కూడా చూడలేదు. కాగ గత రెండు డిబేట్లలో ట్రంప్ పై హిల్లరీనే పై చేయి సాధించిన విషయం తెలిసిందే.
90 నిమిషాల ఈ డిబేట్‌ని ఆరు విభాగాలుగా విభజించారు. జాతీయ రుణాలు, ఆర్థిక వ్యవస్థ, సుప్రీం కోర్టు, ఫిలాసఫీలు, ప్రెసిడెంట్‌గా ఫిట్‌నెస్ తదితర అంశాలపై మోడరేటర్ (సంధానకర్త) క్రిస్ వాలెస్ ప్రశ్నలు సంధించారు. చివరి డిబేట్ లోనూ ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇరువురు అభ్యర్థులు ఒకరిపై ఒకరు ఆధిక్యం సాధించేందుకు పోటీపడ్డారు. తాము అధికారంలోకి వస్తే పురుషులతోపపాటు మహిళలకు సమానంగా హక్కులు కల్పిస్తామని హిల్లరీ హామీ ఇచ్చారు.
కాగా నవంబర్ 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. హిల్లరీ క్లింటన్ వైట్ ప్యాంట్, వైట్ కోటు ధరించి రాగా, ట్రంప్ బ్లాక్ కోటు, వైట్ షర్ట్, రెడ్ టై ధరించి వచ్చారు. ట్రంప్ టీమ్ బోయింగ్ 757 విమానంలో రాగా, హిల్లరీ టీమ్ బోయింగ్ 737 విమానంలో వచ్చింది.