దక్షిణ ఆస్ట్రేలియాలో గతేడాది భారీ సుడిగాలులు వీచాయి. వాటి దెబ్బకు విద్యుత్ స్తంభాలు సైతం కుప్పకూలిపోయాయి! దీంతో ఆ ప్రాంతమంతా కరెంట్ లేకుండా పోయింది. వర్షాలకు, గాలులకు స్తంభాలు కూలిపోయి, తీగలు తెగిపడి కరెంటు పోవడం కొత్తేమీ కాకపోవచ్చు.. ఇలాంటివి సాధారణమే కావచ్చు.. కానీ ఏడాది తర్వాత అక్కడ ఓ అద్భుతం జరిగింది. వంద రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్ బ్యాటరీ సిద్ధమైంది. ఇంకెప్పుడూ కరెంటు కట్ అయ్యే పరిస్థితే తలెత్తకుండా..!
భూతాపోన్నతి కావచ్చు.. వాతావరణ మార్పులు కావచ్చు.. కారణమేదైనా ప్రపంచవ్యాప్తంగా సౌర విద్యుత్‌కు డిమాండ్ పెరిగింది. కాని సోలార్ ప్యానెల్స్‌తో పగలు విద్యుత్ ఉత్పత్తి చేసినా అవసరం మాత్రం చీకటి పడగానే ఎక్కువగా ఉంటుంది. బ్యాటరీలో నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకుందామా అంటే మెగావాట్లకు మెగావాట్లు నిల్వ చేసుకునే బ్యాటరీలు దాదాపుగా లేవు. ఇందుకు తగ్గ టెక్నాలజీలూ అభివృద్ధి కాలేదు. ఈ నేపథ్యంలో దక్షిణ ఆస్ట్రేలియాలో పరీక్షలకు సిద్ధమవుతున్న వంద మెగావాట్ల సామర్థ్యమున్న బ్యాటరీ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. విద్యుత్ కార్ల కంపెనీ ‘టెస్లా’ఓనర్ ఇలాన్ మస్క్.. అడిలైడ్ సమీపంలోని జేమ్స్‌టౌన్ వద్ద ఈ మెగా బ్యాటరీని సిద్ధం చేశారు!
ట్వీటర్ వేదికగా మొదలైన పోటీ
దక్షిణ ఆస్ట్రేలియాలో కరెంటు కష్టాలు ఏర్పడిన సమయంలో మొదలైన ఓ ట్వీటర్ యుద్ధం.. చివరకు వంద మెగావాట్ల బ్యాటరీ ఆవిష్కరణకు దారి తీసింది. గతేడాది సెప్టెంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో భారీగా లోడ్‌షెడ్డింగ్, కరెంటు కోతలు విధించారు. ఈ నేపథ్యంలో మార్చిలో టెస్లా వైస్ ప్రెసిడెంట్ లైడన్ రీవ్.. ‘మా కంపెనీ బ్యాటరీలతో కరెంట్ కోతలకు ఫుల్‌స్టాప్ పెట్టవచ్చు. ఇందుకు పెద్దగా సమయం కూడా పట్టదు. వంద రోజుల్లో వంద మెగావాట్ల విద్యుత్ నిల్వ చేసే బ్యాటరీని ఏర్పాటు చేస్తాం’అని ట్వీట్ చేశారు. దీనికి ఆట్లాసియాన్ కంపెనీ ఓనర్ మైక్ కానన్ బ్రూక్స్ స్పందిస్తూ..‘నిజంగానే అంటున్నారా? అయితే నిధులు సేకరించే పని నాకు వదిలిపెట్టండి (ప్రభుత్వంతో మాట్లాడటం కూడా) మీరు వంద రోజుల్లో వంద మెగావాట్ల బ్యాటరీ ఏర్పాటు చేసి చూపించండి’అని సవాలు విసిరారు. దీంతో రంగంలోకి దిగిన టెస్లా కంపెనీ ఓనర్ ఇలాన్ మస్క్.. ‘సరే. వంద రోజుల్లో మేం బ్యాటరీని ఏర్పాటు చేయలేక పోతే.. దాన్ని ఉచితంగా ఇచ్చేస్తా’అని ప్రకటిం చారు! ఈ మేరకు వంద మెగావాట్ల బ్యాటరీ తయారీకి 5 కోట్ల డాలర్లు (రూ.322 కోట్లు) వరకు ఖర్చవుతుందని అప్పట్లో మస్క్ అంచనా వేశారు. దక్షిణ ఆస్ట్రేలియా ప్రభుత్వా నికి తన ప్రతిపాదనను వివరించి.. వారితో సెప్టెంబర్ 29న ఒప్పందం కుదుర్చుకుని మస్క్ పని మొదలుపెట్టారు. లెక్క ప్రకారం డిసెంబర్ 1కల్లా బ్యాటరీ అందుబాటులోకి రావాల్సి ఉండగా వారం రోజుల మందుగానే ప్రభుత్వానికి అప్పగించేశారు. ‘ఇక మీరు పరీక్షించుకుని వాడుకోవడమే మిగిలింది’ అని చెప్పేశారు. పోటీలో నెగ్గి రూ.322 కోట్లు మిగుల్చుకున్నారు!
మూడు రెట్లు పెద్దది..
టెస్లా అభివృద్ధి చేసిన వంద మెగావాట్ల బ్యాటరీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అతిపెద్ద బ్యాటరీ. ఇదే కంపెనీ కాలిఫోర్నియా ప్రాంతంలో ఇప్పటికే 80 మెగావాట్ల సామర్థ్యమున్న బ్యాటరీ ప్యాక్‌ను ఏర్పాటు చేసింది. వంద మెగావాట్ల బ్యాటరీ ఒకసారి పనిచేయడం మొదలుపెడితే దాదాపు 30 వేల ఇళ్లకు రోజుకు 8 గంటలపాటు విద్యుత్ అందించవచ్చు. బ్యాటరీని వచ్చే వారంలో దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్ వెదరిల్ ప్రారంభించనున్నారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment