- కేసీఆర్‌కు కేంద్రమంత్రి దత్తాత్రేయ సూచన
మహబూబ్‌నగర్: కేంద్రం సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సిద్ధంగా ఉందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు అధికమవుతున్న తరుణంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు సోలార్ పాలసీని రూపొందించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడారు.
జిల్లాలో ఎక్కడైనా 2,500 ఎకరాల స్థలం చూపిస్తే మొదటగా 500 మెగావాట్ల విద్యుత్‌కు కేంద్రం నుంచి ఆమోదముద్ర వేయిస్తానని అన్నారు. లేబర్ యాక్టును కట్టుదిట్టం చేస్తామని స్పష్టం చేశారు. అందరికి సమాన వేతనాలు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేపడతామని, వేజ్‌బోర్డు విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా పని చేస్తేనే దేశ, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావును గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు