తెలంగాణకు మూడేళ్లపాటు కరెంటివ్వండి
ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్‌కు ఎంపీ దత్తాత్రేయ వినతి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగానికి, ఇతర అవసరాల కోసం వెంటనే వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను అందించాలని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ విజ్ఞప్తిచేశారు. మరో మూడేళ్ల పాటు ప్రత్యామ్నాయ వనరులను అభివృద్ధి చేసుకునే వరకు తెలంగాణకు తగిన సహాయాన్ని చేయాలని ఆయన కోరారు. ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లో సీఎం రమణ్‌సింగ్‌ను కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు. కొత్తగా లైన్ వేయడానికి కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని అధికారులు చెబుతున్నందున తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ల మధ్య ఏడాదిలోగా గ్రిడ్ కనెక్షన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాయాలని సీఎం రమణ్‌సింగ్‌కు దత్తాత్రేయ విజ్ఞప్తిచేశారు.
తీవ్ర విద్యుత్‌సంక్షోభం కారణంగా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఒకవైపు, చిన్నతరహా పరిశ్రమల మూసివేత మరోవైపు సాగుతున్నాయని పేర్కొన్నారు. కరెంట్‌కోతల వల్ల గృహ వినియోగదారులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.