అమెరికాపై అణు బాంబు వేస్తాం
ఉత్తర కొరియా హెచ్చరిక
ప్యాంగ్‌యాంగ్: అగ్రరాజ్యం అమెరికాపై ఏ క్షణమైనా అణు బాంబులతో దాడి చేస్తామని ఉత్తర కొరియా గురువారం హెచ్చరించింది. అమెరికా చర్యల వల్ల తలెత్తే ఎలాంటి విపత్కర ఫలితాలకైనా ఆ దేశమే బాధ్యత తీసుకోవాలని తేల్చిచెప్పింది. ఉత్తర కొరియా అణు పరీక్షలకు సన్నద్ధమవుతోందని వార్తల నేపథ్యంలో ఇలాంటి ప్రకటనలు కలవరం సృష్టిస్తున్నాయి. మరోవైపు, చైనా సహకరించినా, లేకున్నా ఉత్తర కొరియాను దారికి తీసుకొస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చిచెప్పారు.
నిలువ నీడా దొరకదు..
యుద్ధానికి సంబంధించిన డ్రిల్‌ను ఇటీవలే పూర్తిచేశామని, తాము దాడికి పాల్పడితే అమెరికా స్వరూపమే మారిపోతుందని ఉత్తర కొరియా ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు ‘రోడాంగ్ సిన్మన్’ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించారు. ప్రాణాలతో బయట పడే ప్రజలకు కనీసం ఉండటానికి వసతులు కూడా దొరకవని పేర్కొన్నారు. ఉత్తర కొరియా నుంచి ఎదురయ్యే అణ్వాయుధ, క్షిపణి పరీక్షల ముప్పును ఎదుర్కోవడానికి అమెరికా కేంద్ర నిఘా ఏజెన్సీ(సీఐఏ) ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది. ఈ కొత్త వ్యవస్థకు ‘కొరియా మిషన్ సెంటర్’గా నామకరణం చేశారు.