'అమెరికా బ్లాక్మెయిల్‌కు లొంగేది లేదు'
సియోల్: శక్తివంతమైన అణుపరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా తన చర్యలను సమర్థించుకుంది. అమెరికా న్యూక్లియర్ 'బ్లాక్మెయిల్'కు తలొగ్గేది లేదని శనివారం స్పష్టం చేసింది. తమ దేశం చేపడుతున్న బలమైన సైనిక చర్యలు అమెరికాకు ఆగ్రహం తెప్పిస్తున్నాయని.. అయితే దానిని లెక్కచేసేది లేదని ఉత్తరకొరియా అధికార పార్టీ మీడియా సంస్థ వెల్లడించింది.
ఉత్తర కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ కేసీఎన్‌ఏ దక్షిణ కొరయా అధ్యక్షురాలు పార్క్ గిన్ హై పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఉత్తరకొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని వ్యతిరేకించినందుకు గాను పార్క్పై కేసీఎన్‌ఏ విరుచుకుపడింది. విదేశీ సైన్యపు 'డర్టీ ప్రాస్టిట్యూట్' పార్క్ అని తీవ్రంగా మండిపడింది. పార్క్ అధారరహిత ఆరోపణలు చేశారని, ఇలాంటి అమెరికా తొత్తుల విమర్శలతో ఉత్తర కొరియా తన విధానాన్ని మార్చకోదని వెల్లడించింది. తాజా అణుపరీక్షల నేపథ్యంలో ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు ఐక్యరాజ్య సమితి సమాయత్తమౌతోంది.