మరో ఖండాంతర క్షిపణి
► పరీక్షించిన ఉత్తర కొరియా
► అమెరికా మొత్తం దీని పరిధిలోకి..!
సియోల్: అగ్రదేశం అమెరికా సహా ప్రపంచ దేశాల హెచ్చరికలను ఉత్తర కొరియా ఏమాత్రం పట్టించుకోవట్లేదు. శుక్రవారం రాత్రి మరోమారు ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)ని ప్రయోగించింది. ఈ నెలలో ఐసీబీఎం ప్రయోగాన్ని రెండోమారు జరిపిన ఉత్తర కొరియా.. తాజా క్షిపణితో అమెరికాలోని ఏ ప్రాంతంలోనైనా దాడులు చేయగలమని స్పష్టం చేసింది.
అమెరికాకు గట్టి హెచ్చరికలు పంపేందుకే ఈ పరీక్ష జరిపినట్లు దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చెప్పారు. అమెరికాలోని ఏ ప్రాంతం పైనైనా దాడి చేయగలమని కిమ్ చెప్పినట్లు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ నెల 4న ప్రయోగించిన క్షిపణి కంటే తాజా క్షిపణి అత్యంత శక్తిమంతమైనదని, దాని పరిధి 10 వేల కిలోమీటర్ల వరకు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. న్యూయార్క్, వాషింగ్టన్ వంటి నగరాలు ఆ క్షిపణి పరిధిలోకి వస్తాయని హెచ్చరిస్తున్నారు.
నిర్లక్ష్య, ప్రమాదకర చర్య: ట్రంప్
ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష నిర్లక్ష్య, ప్రమాదకర చర్య అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. అంతర్జాతీయ సమాజంలో ఉత్తర కొరియా తనను తాను ఒంటరి చేసుకుంటోందని పేర్కొన్నారు. అమెరికా భూభాగాన్ని రక్షించుకునేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష జరపడాన్ని చైనా ఖండించింది. ఉద్రిక్తతలు పెంచే చర్యలు మానుకోవాలని హితవుపలికింది. ప్రస్తుత పరిస్థితిపై ఆందోళనపడుతున్నామని పేర్కొంది.