
భారత్-శ్రీలంక మధ్య ‘అణు’బంధం
న్యూఢిల్లీ: భారత్-శ్రీలంక మధ్య ‘అణు’బంధం చిగురించింది. రెండు దేశాల మధ్య పౌర అణు ఒప్పందం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మధ్య సోమవారమిక్కడ జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఒప్పందం ఖరారైంది. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య సంబంధా లు కొత్త శిఖరాలకు చేరుకుంటాయని ఇరువురు నేతలు ఆశాభావం వ్యక్తంచేశారు. రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ఇరు దేశాల మధ్య జాలర్ల అంశాన్ని సామరస్యంగా, మానవతా దృక్పథంతో పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డాయి. చర్చల అనంతరం మోదీ, సిరిసేన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘పౌర అణు ఒప్పందం రెండు దేశాల మధ్య ఉన్న పరస్పర విశ్వాసానికి మరో ప్రతీక. శ్రీలంక ఇలాంటి ఒప్పందం కుదుర్చుకోవడం మొదటిసారి. దీనివల్ల అనేక రంగాల్లో రెండుదేశాల మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. శ్రీలంక-భారత్ మ ధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. అనేక అంశాలు ఉమ్మడి నిర్ణయాలతో ముడివడి ఉన్నాయి. దేశాధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత సిరిసేన తొలిసారి భారత్‌కు వచ్చినందుకు సం తోషం. జాలర్ల విషయంలో అర్థవంతమైన చర్చలు జరిగాయి. 2 దేశాల మధ్య మత్స్యకార సంఘాలను ప్రోత్సహిస్తాం.’అని మోదీ చెప్పారు.