న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో శ్రీలంక ఆటగాళ్లు మాస్క్‌లు ధరించడంపై టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తనదైన శైలిలో స్పందించారు. ఒకే మైదానంలో ఆడుతున్న ఇరు జట్లలో టీమిండియా ప్లేయర్లు ఎందుకు మాస్కులు ధరించలేదని పరోక్షంగా లంక ప్లేయర్ల డ్రామాను ప్రస్తావించారు. రెండో రోజు ఆటలో కాలుష్యంతో మైదానంలో గాలి పీల్చుకోలేకపోతున్నామని, మ్యాచ్ నిలిపివేయాలని పదేపదే లంక ఆటగాళ్లు అంపైర్లకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
రెండో రోజు ఆట ముగిసిన అనంతరం భరత్ అరుణ్ మీడియాతో ముచ్చటించారు.‘ భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి రెండు రోజులుగా మాస్క్ లేకుండానే బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్‌పై దృష్టి సారించి తమ జట్టు పట్టు సాధించింది. మైదానంలో ఇరు జట్లకు ఒకే పరిస్థితి ఉంది. అయినా లంక ప్లేయర్లు మాత్రమే మాస్కులు ధరించి మ్యాచ్ నిలిపేయాలని కోరారు. కాలుష్యం ఎక్కడైనా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేయదు. ఆటపై దృష్టి పెట్టడమే ఆటగాళ్ల బాధ్యత. వేదికలతో ఆటగాళ్లకు సంబంధంలేదు.’అని పరోక్షంగా లంక ఆటగాళ్లకు చరకలంటించారు.
ఈ ఘటనపై లంక బోర్డు బీసీసీఐని వివరణ కోరినట్లు.. కాలుష్యం ఎక్కువగా ఉన్న ఢిల్లీని షెడ్యూల్‌లో ఎందుకు చేర్చినట్లు ప్రశ్నించిందని వార్తలొచ్చాయి. ఇక అంతకు ముందు లంక ప్లేయర్లు పదేపదే మ్యాచ్‌కు అంతరాయం కలిగించడంతో చిరాకెత్తిన కోహ్లి భారత ఇన్నింగ్స్‌ను 536 పరుగుల వద్ద డిక్లెర్ ఇచ్చి లంకను బ్యాటింగ్ ఆహ్వానించాడు. అయితే భారత ఆటగాళ్లు మాస్క్‌లు ధరించకుండా ఫీల్డింగ్ చేయడం గమనార్హం. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. భారీ స్కోరు దిశగా దూసుకుపోతున్న భారత్‌ను నిలువరించలేక లంక ఈ డ్రామాకు తెరలేపిందని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment