దలైలామాతో ఒబామా భేటీ
వాషింగ్టన్: ప్రముఖ ఆధ్యాత్మిక మతగురువు దలైలామాతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భేటీ అయ్యారు. వైట్ హౌస్‌లోని మాప్ రూమ్‌లో ఈ సమావేశం జరిగింది. పూర్తిగా ప్రయివేట్గా కొనసాగిన వీరి భేటీకి మీడియాను అనుమతించలేదు. కాగా దలైలామాతో ఒబామా సమావేశం కావటం ఇది నాలుగోసారి. మరోవైపు ఈ భేటీని చైనా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే చైనా హెచ్చరికలను ఒబామా ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు కొనసాగుతున్నారు. అయితే అధికారిక కార్యాలయం ఓవల్లో కాకుండా వైట్హౌస్లో దలైలామాతో ఒబామా భేటీ కావటం విశేషం.
కాగా ఇది కేవలం వ్యక్తిగత సమావేశం మాత్రమేనని, ద్వైపాక్షిక చర్చలు కాదని వైట్హౌస్ అధికార ప్రతినిధి జోష్ ఎర్నెస్ట్ తెలిపారు. మానవ హక్కులు, సమానత, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ఒబామా, దలైలామ మధ్య చర్చలు జరిగినట్లు వెల్లడించారు. అయితే ఇతర వివరాలను మీడియాకు వెల్లడించేందుకు నిరాకరించారు. భేటీ అనంతరం మరోవైపు ఫ్లోరిడా రాష్ట్రం ఆర్లెండోలో పల్స్ నైట్ క్లబ్ దాడి ఘటనలో మృతి చెందనవారికి దలైలామ సంతాపం తెలిపినట్లు వైట్హౌస్ పేర్కొంది. ఇక అమెరికా అధ్యక్షుడు ఒబామాతో దలైలామా సమావేశ మైనప్పుడల్లా చైనా ఆగ్రహం ప్రదర్శిస్తోంది.
దలైలామను వేర్పాటువాదిగా పేర్కొంటూ ఈ సమావేశాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. స్వేచ్ఛ పేరుతో చైనా సార్వభౌమాధికారాన్ని, భద్రతను దెబ్బతీస్తే మాత్రం సహించేది లేదంటూ చైనా మంత్రిత్వ శాఖ ప్రతినిధి లూ కాంగ్ నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దలైలామాతో ఏ దేశ నాయకుడు, ఏ రూపంలో సమావేశం జరిపినా చైనా ఖచ్చితంగా వ్యతిరేకిస్తుందన్నారు. టిబెట్‌కు సంబంధించిన అంశాల పేరుతో చైనా అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నాతాము గట్టిగా వ్యతిరేకిస్తామని లూ కాంగ్ హెచ్చరించారు.