china angry
-
తైవాన్‌పై మళ్లీ చైనా ఆగ్రహజ్వాల
బీజింగ్: తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్ వెన్ అమెరికాలో పర్యటించడాన్ని సహించని చైనా ఆగ్రహంతో రగిలిపోతోంది. ఎనిమిది యుద్ధనౌకలు, 71 యుద్ధవిమానాలను మోహరించి తైవాన్ సముద్రజల్లాల్లో ఉద్రిక్తత ను మరింత పెంచింది. తమ అధ్యక్షురాలు అమెరికాలో పర్యటించడంతో అక్కసుతో చైనా ఇలాంటి బెదిరింపు చర్యలకు దిగుతోందని తైవాన్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. 45 యుద్ధవిమానాలు ‘మిడిల్లైన్’ను దాటి మరీ తమ ప్రాదేశిక జలాలపై చక్కర్లు కొడుతున్నాయని తైవాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘యుద్ధ సన్నద్ధత గస్తీ’ మాటున మూడ్రోజులపాటు నౌకాదళ సంపత్తిని చైనా రంగంలోకి దించింది. అమెరికా పర్యటనలో భాగంగా తైవాన్ అధ్యక్షురాలు త్సాయి గురువారం కాలిఫోర్నియాలో అమెరికా పార్లమెంట్ ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీతో భేటీ అయ్యారు. దీంతో కోపం తెచ్చుకున్న చైనా పలు అమెరికన్ సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించింది. -
అమెరికా బృందం టూర్‌పై ఆగ్రహం.. తైవాన్ను చుట్టుముట్టిన చైనా!
బీజింగ్: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనతో ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతోంది చైనా. తైవాన్‌పై యుద్ధం చేసినంత పని చేసింది. ఆ ఆగ్రహ జ్వాలలకు మరింత ఆజ్యం పోస్తోంది అమెరికా. మరోమారు అమెరికాకు చెందిన చట్టసభ్యులు కొందరు తైవాన్‌లో పర్యటించారు. తైపీ నేతలతో సమావేశమైన క్రమంలో చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ జలసంధివ్యాప్తంగా తాజాగా మిలిటరీ డ్రిల్స్ చేపట్టినట్లు ప్రకటించింది. యుద్ధ నౌకలు, మిసైల్స్, జెట్స్ వంటి వాటిని తైవాన్ సమీప జలాల్లోకి చైనా పంపించిన తర్వాత ఈ అప్రకటిత పర్యటన చేపట్టారు అమెరికా చట్టసభ్యులు. దీంతో డ్రాగన్‌కు మరింత కోపం తెప్పించినట్లయింది. డెమోక్రాటిక్ పార్టీ సెనేటర్ ఎడ్ మార్కీ నేతృత్వంలోని ఐదుగురు చట్ట సభ్యుల బృందం ఆదివారం రాత్రి 7 గంటలకు తైపీ చేరుకుంది. ఈ బృందం ఆది, సోమవారాల్లో అక్కడే ఉండి అమెరికా-తైవాన్‌ల సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రాంతీయ భద్రత, వాతావరణ మార్పులు వంటి తదితర అంశాలపై సీనియర్ నేతలతో చర్చలు జరిపింది. ఈ బృందం ఆకస్మిక పర్యటనతో బీజింగ్‌కు ఆగ్రహం తెప్పించినట్లయింది. యుద్ధాన్ని ఎదుర్కునేందుకు పెట్రోలింగ్, యుద్ధ సన్నాహక ప్రదర్శనలు చేపట్టినట్లు సోమవారం ప్రకటించింది డ్రాగన్. ‘ తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వాన్ని అణగదొక్కేందుకు నిరంతరం రాజకీయ కుట్రలు చేస్తున్న అమెరికా, తైవాన్లకు వ్యతిరేకంగా చేపడుతున్న మిలిటరీ డ్రిల్స్ ఇవి. జాతీయ సమగ్రతను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం.’ అని పేర్కొన్నారు చైనా మిలిటరీ తూర్పు థియేటర్ కమాండ్ ప్రతినిధి షి యి. మరోవైపు.. పెలోసీ పర్యటనను చాకుగా చూపించి తమ ప్రాంతాన్ని ఆక్రమించుకునే కుట్రలు చేస్తోందని చైనాపై ఆరోపణలు చేసింది తైవాన్ ప్రభుత్వం. ఇదీ చదవండి: తైవాన్‌కు మళ్లీ అమెరికా బృందం -
తైవాన్ ద్వీపాన్ని దిగ్బంధించిన చైనా సైన్యం
బీజింగ్: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యాటనతో మండిపడుతోంది చైనా. తైవాన్‌పై ఇప్పటికే ప్రతీకార చర్యలు చేపట్టింది. తైపీ దిగుమతులపై ఆంక్షలు విధించిన డ్రాగన్.. ఆ దేశానికి అతి సమీపంలో మిలిటరీ డ్రిల్స్ చేపట్టింది. గత మంగళవారం నుంచి ఈ సైనిక ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా గురువారం మరింత దూకుడు పెంచింది. ఆరు వైపుల నుంచి తైవాన్ను చుట్టుముట్టాయి చైనా బలగాలు. తైపీ సమీపంలోని సముద్ర జలాల్లోకి బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగిస్తూ భయాందోళన కలిగిస్తున్నాయి. మిసైల్స్‌కు సంబంధించిన దృశ్యాలు చైనా అధికారిక మీడియా సీసీటీవీలో ప్రసారమయ్యాయి. మిలిటరీ ప్రదర్శనలో భాగంగా తైవాన్ సమీపంలోని జలాల్లోకి మిసైల్స్ ప్రయోగించినట్లు పేర్కొంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. లాంగ్ రేంజ్ ఆయుధాలను ప్రయోగించినట్లు బీజీంగ్ మిలిటరీ సైతం ప్రకటించింది. చరిత్రలో ఇదే అతిపెద్ద మిలిటరీ డ్రిల్‌గా పేర్కొంది. గురువారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బాంబుల మోతలు, ఆకాశంలో ఆయుధాల పొగ కనిపించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇదీ చదవండి: చైనా, తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు! పెలోసీ పర్యటనపై డ్రాగన్ కంట్రీ కన్నెర్ర -
ట్రంప్ ఫోన్‌కాల్.. చైనా ఆగ్రహం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్.. తైవాన్ అధ్యక్షురాలు ట్సాయ్ యింగ్-వెన్‌తో ఫోన్లో మాట్లాడటంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా, తైవాన్‌ల మధ్య అధికారిక సంబంధాలను, మిలటరీ ఒప్పందాలను తాము వ్యతిరేకిస్తామని చైనా స్పష్టం చేసింది. 1979లో తైవాన్‌తో దౌత్య సంబంధాలను అమెరికా తెగదెంపులు చేసుకుంది. తైపీలో అమెరికా తన రాయబార కార్యాలయాన్ని మూసివేసింది. ఒకే చైనా పాలసీని ప్రకటించింది. ఆ తర్వాత అమెరికా, తైవాన్‌ల మధ్య అధికారిక చర్చలు కానీ ఎలాంటి ఒప్పందాలు కానీ జరగలేదు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. తైవాన్ అధ్యక్షురాలు ఫోన్లో మాట్లాడుకున్నారు. 37 ఏళ్ల తర్వాత అమెరికా, తైవాన్‌ల తొలి దౌత్య సంబంధం ఇదే. దీనిపై అమెరికా వివరణ ఇవ్వాలని చైనా కోరింది. ‘నేను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు తైవాన్ అధ్యక్షురాలు ఫోన్ చేసి అభినందించారు. ఆమెకు ధన్యవాదాలు’ అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. -
దలైలామాతో ఒబామా భేటీ
వాషింగ్టన్: ప్రముఖ ఆధ్యాత్మిక మతగురువు దలైలామాతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భేటీ అయ్యారు. వైట్ హౌస్‌లోని మాప్ రూమ్‌లో ఈ సమావేశం జరిగింది. పూర్తిగా ప్రయివేట్‌గా కొనసాగిన వీరి భేటీకి మీడియాను అనుమతించలేదు. కాగా దలైలామాతో ఒబామా సమావేశం కావటం ఇది నాలుగోసారి. మరోవైపు ఈ భేటీని చైనా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అయితే చైనా హెచ్చరికలను ఒబామా ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు కొనసాగుతున్నారు. అయితే అధికారిక కార్యాలయం ఓవల్‌లో కాకుండా వైట్‌హౌస్‌లో దలైలామాతో ఒబామా భేటీ కావటం విశేషం. కాగా ఇది కేవలం వ్యక్తిగత సమావేశం మాత్రమేనని, ద్వైపాక్షిక చర్చలు కాదని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జోష్ ఎర్నెస్ట్ తెలిపారు. మానవ హక్కులు, సమానత, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ఒబామా, దలైలామ మధ్య చర్చలు జరిగినట్లు వెల్లడించారు. అయితే ఇతర వివరాలను మీడియాకు వెల్లడించేందుకు నిరాకరించారు. భేటీ అనంతరం మరోవైపు ఫ్లోరిడా రాష్ట్రం ఆర్లెండోలో పల్స్ నైట్ క్లబ్ దాడి ఘటనలో మృతి చెందనవారికి దలైలామ సంతాపం తెలిపినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. ఇక అమెరికా అధ్యక్షుడు ఒబామాతో దలైలామా సమావేశ మైనప్పుడల్లా చైనా ఆగ్రహం ప్రదర్శిస్తోంది. దలైలామను వేర్పాటువాదిగా పేర్కొంటూ ఈ సమావేశాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. స్వేచ్ఛ పేరుతో చైనా సార్వభౌమాధికారాన్ని, భద్రతను దెబ్బతీస్తే మాత్రం సహించేది లేదంటూ చైనా మంత్రిత్వ శాఖ ప్రతినిధి లూ కాంగ్ నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దలైలామాతో ఏ దేశ నాయకుడు, ఏ రూపంలో సమావేశం జరిపినా చైనా ఖచ్చితంగా వ్యతిరేకిస్తుందన్నారు. టిబెట్‌కు సంబంధించిన అంశాల పేరుతో చైనా అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకున్నాతాము గట్టిగా వ్యతిరేకిస్తామని లూ కాంగ్ హెచ్చరించారు.