'ఒబామా ఓ కోతి'
- అమెరికా అధ్యక్షుడిపై ఉత్తర కొరియా ధ్వజం
- ‘ద ఇంటర్వ్యూ’ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించేలా ప్రోత్సహిస్తున్నారని విమర్శ
సియోల్: అమెరికా, ఉత్తర కొరియాల మధ్య ‘ద ఇంటర్వ్యూ’ కామెడీ చిత్రంపై దుమారం తీవ్రమవుతోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కోతిగా ఉత్తర కొరియా అభివర్ణించడం కలకలం రేపుతోంది. అంతేకాదు, తమ మీడియా సంస్థల ఇంటర్నెట్ వ్యవస్థపై అమెరికా సైబర్ నిపుణులతో దాడి చేయించిందని కూడా కొరియా ఆరోపించింది.
‘‘ఒబామా ఎప్పుడూ తన మాటల విషయంలో నిర్లక్ష్యంగాను, చేతల విషయంలో అడవిలోని కోతిలాగానూ ప్రవర్తిస్తారు. పదే పదే హెచ్చరించినా, తన దురహంకార వైఖరితో సినిమా ప్రదర్శన కొనసాగించాలని అమెరికా నిర్ణయించుకుంటే.. ఆ దేశాన్ని తప్పించుకోలేని విధంగా దెబ్బతీస్తాం’’ అని కొరియాకు చెందిన ‘నేషనల్ డిఫెన్స్ కమిషన్’ ప్రతినిధి హెచ్చరించారు. ‘ద ఇంటర్వ్యూ’ చిత్రంలో ఉత్తర కొరియా అధ్యక్షుడి హత్యకు కుట్ర చేసే సన్నివేశాలున్నాయి.
ఆ సినిమా విడుదలైతే సైబర్ దాడులు చేస్తామంటూ దాన్ని రూపొందించిన ‘సోనీ పిక్చర్స్’ను, సినిమా థియేటర్లను ఉత్తర కొరియా హ్యాకర్లు హెచ్చరించారు. దీంతో ఆ చిత్రం విడుదలను సోనీ మొదట్లో నిలిపేసింది. అయితే క్రిస్మస్ సందర్భంగా కొన్ని థియేటర్లలో ఆ చిత్రం ప్రదర్శితమైంది. ఒబామా ఆ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించేలా అందరినీ ప్రోత్సహించారన్నది ఉత్తర కొరియా వాదన. ఈ నేపథ్యంలో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్‌ను కొందరు హ్యాక్ చేశారు. ఇది ఉత్తర కొరియా పనేనని అమెరికా ఆరోపిస్తోంది.