అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేసే విషయంపై మీడియా ఎంట్రపెన్యూర్, టెలివిజన్ సలహాదారు ఓప్రా విన్‌ఫ్రీ ‘గట్టిగా యోచిస్తున్నారని’ ఆమె సన్నిహిత మిత్రులిద్దరు సీఎన్ఎన్‌కు వెల్లడించారు. ఆదివారం బీవర్లీహిల్స్‌లో గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె పాల్గొని ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. ఆ తర్వాతే విన్‌ఫ్రీ వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తారన్న ఊహాగానాలు ఊపుందుకున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ అంశాన్ని కొన్ని నెలల క్రితం ఓప్రా ప్రస్తావించారని తమ పేరు వెల్లడించడానికి ఇష్టపడని అమె మిత్రులిద్దరు చెప్పారు. ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి విన్‌ఫ్రీ అధికార ప్రతినిధి నిరాకరించారు. అమెరికా వినోద రంగంలో విశేష కృషి చేసినవారికిచ్చే సెసిల్ డీమిల్ అవార్డు స్వీకరిస్తూ ఓప్రా అద్భుత ప్రసంగం చేశారని అన్ని వర్గాల నుంచి ప్రశంసలందుకున్నారు.
మీడియాతోపాటు హాలివుడ్‌లో మహిళలపై సాగుతున్న లైంగిక వేధింపులను నిరసిస్తూ సాగుతున్న ‘మీ టూ ఉద్యమం’ ఆమె ప్రసంగంలో ప్రధాన అంశంగా నిలిచింది. ఎంతో ఆశావహ దృక్పథంతో, ‘ ఈ కొత్త రోజున ఆశారేఖ కనిపిస్తోంది’ అన్న మాటలు ఆమె మరో కోర్కెకు(అధ్యక్షపదవి) అద్దంపడుతున్నాయని అనేక మంది ఉదారవాదులైన ప్రముఖులు అర్థంచేసుకున్నారు. ఓప్రా బలమైన డెమోక్రాటిక్ అభ్యర్థి కావడానికి ఆమెకున్న డబ్బు, పేరు ప్రఖ్యాతులు సరిపోతాయని కిందటేడాది కొందరు అంచనావేశారు. ఓప్రా విన్‌ఫ్రీ షో అనే టెలివిజన్కార్యక్రమం ద్వారా జనం వ్యక్తిగత సమస్యలు విని ఊరట ఇచ్చే మాటలతో పరిష్కారాలు సూచించడం ద్వారా ఓప్రా అమెరికాలోనేగాక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజల మన్ననలు పొందారు.
అయితే, వరుసగా ఇద్దరు టీవీ ప్రముఖులను అధ్యక్ష పీఠం ఎక్కిస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ కూడా టీవీ రియాలిటీ షో ద్వారానే అందరికీ తెలిశారు. గతంలో అధ్యక్ష పదవికి పోటీపై అడిగిన ప్రశ్నలను ఆమె దాటవేశారు. ఓప్రా పోటీచేసే అవకాశముందని ప్రసంగం ముగిశాక 31 ఏళ్లుగా ఆమె జీవితభాగస్వామి స్టెడ్మన్గ్రహమ్చెప్పారు. ‘‘ అంతా ప్రజలే నిర్ణయిస్తారు. ఆమె తప్పక ఆ పనిచేస్తారు,’’ అని ఆయన తెలిపారు. 2008 ఎన్నికల్లో బరాక్ఒబామా, 2016లో మరో డెమొక్రాట్ హిల్లరీ క్లింటన్ తరఫున ఓప్రా ప్రచారం చేశారు.
స్త్రీలు, పురుషులు ఎలా ప్రవర్తిస్తారో చెబుతూనే ఉన్నా!
‘‘వాస్తవానికి స్త్రీలు, పురుషులు ఎలా ప్రవర్తిస్తారో చెప్పడానికే నేను నా వృత్తిలో టెలివిజన్, సినిమా ద్వారా శాయశక్తులా ప్రయత్నించా. మన జీవితాల్లో అవమానాలు ఎలా భరిస్తాం, ప్రేమను ఎలా అనుభవిస్తాం, కోపంతో ఎలా ఊగిపోతాం, ఎలా ఓడిపోతాం, ఎలా పారిపోతాం, ఎలా కష్టాలు భరించి వాటిని అధిగమిస్తాం ఈ ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్పడానికి నేను చేయగలిగినంత చేశా. జీవితంలో అత్యంత నికృష్ట కష్టాలు తట్టుకుని నిలబడి ఘోరమైన సమయాల్లో సైతం ఆశావహమైన రేపటి ఉదయం కోసం వేచిచూసిన వ్యక్తులను ఇంటర్వ్యూ చేసి, వారి గురించి ప్రజలకు వర్ణించాను,’’ అంటూ ఓప్రా తన ప్రసంగంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. మరోసారి ‘నేను సైతం’ అని గొంతెత్తే అవసరం రాకుండా ఇక్కడ కూర్చున్న గొప్ప మహిళలు, ఉన్నతమైన పురుషులు వీరోచిత పోరు సాగిస్తున్నారు. వారి కృషి వల్లే ఓ కొత్త ఉషోదయం మన కళ్ల ముందు ఆవిష్కృతమౌంది,’’ అని ఓప్రా తన ప్రసంగం ముగించారు.
ఓప్రాను మెచ్చుకున్న ఇవాంకా
ఓప్రా ఉపన్యాసం విన్న ట్రంప్ పెద్ద కూతురు ఇవాంకా, ‘ కిందటి రాత్రి గోల్డెన్ గ్లోబ్స్‌లో ఓప్రా చేసిన ఉత్తేజపూరిత ప్రసంగం ఇప్పుడే చూశా. మనమంతా - స్త్రీలు, పురుషులు చేతులు, గొంతు కలపి ‘సమయం ముంచుకొచ్చింది’ అందాం’ అని ట్వీట్చేశారు. అయితే, ఆమె మాటలు కపట ధోరణికి అద్దంపడుతున్నాయని, తండ్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చినప్పుడు ఇవాంకా ఏం చేశారని పలువురు ట్విటర్లోనే ప్రశ్నించారు. సూపర్ మోడల్ క్రిసీ టెయిగన్ క్లుప్తంగా, ‘ఇవ్(ఇవాంకా) పో’ అని ఈసడించుకోగా, ప్రముఖ నటుడు ఆడమ్‌పాలీ, ‘ నీ తండ్రిపై చేసిన 16 లైంగిక వేధింపుల అభియోగాల సంగతేంటి?’ అని ప్రశ్నించారు.
బాల్యమంతా కష్టాలమయమే!
పెళ్లిగాని ఆఫ్రికన్అ మెరికన్ టీనేజ్ తల్లికి పుట్టిన ఓప్రా బాల్యంలో నానా కష్టాలు అనుభవించారు. ఇప్పుడు 63 ఏళ్ల ఓప్రాకు దాదాపు మూడొందల కోట్ల డాలర్ల ఆస్తులున్నాయి. ప్రస్తుతం ఆమె ‘ఓన్’ అనే కేబుల్ చానెల్ సీఈఓగానేగాక, సీబీఎస్ న్యూస్ మేగజీన్ కార్యక్రమం ‘60 మినిట్స్’కు స్పెషల్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. వెయిట్ వాచర్స్ వంటి అనేక కంపెనీల్లో ఆమె పెట్టుబడులున్నాయి.
సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment