
వాషింగ్టన్: అమెరికాలో శాశ్వత నివాసానికి ఉపయోగపడే గ్రీన్‌కార్డు పొందేందుకు దాదాపు 2.27 లక్షల మంది భారతీయులు ఎదురుచూస్తున్నట్లు అమెరికా అధికార గణాంకాలు చెబుతున్నాయి. కుటుంబ సభ్యులకు ఇచ్చే ఫ్యామిలీ స్పాన్‌సర్డ్ గ్రీన్‌కార్డుల కోసం మొత్తంగా 40 లక్షల మంది వేచి చూస్తూంటే.. 15 లక్షలతో మెక్సికో తొలిస్థానంలో, 2.27 లక్షలతో భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు అంచనా. అమెరికా చట్టాల ప్రకారం ఏటా జారీ చేయగల గ్రీన్‌కార్డులు గరిష్టంగా 2.26 లక్షలు మాత్రమే. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ విడుదల చేసిన వివరాల ప్రకారం గ్రీన్‌కార్డుల వెయిటింగ్ లిస్ట్‌లో 1.80 లక్షలతో చైనా మూడోస్థానంలో ఉంది.
అమెరికా పౌరసత్వం ఉన్న వారు తమ కుటుంబ సభ్యులకు (తోబుట్టువులు, తల్లిదండ్రులు, భార్య, కొన్ని పరిమితులకు లోబడి పిల్లలకు) పౌరసత్వం కల్పించేందుకు అవకాశముంది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రకమైన అవకాశాలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఫ్యామిలీ స్పాన్సర్డ్ గ్రీన్‌కార్డులను పూర్తిగా నిషేధించాలని చూస్తూండగా ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీ గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయుల్లో అత్యధికులు అమెరికన్ పౌరసత్వమున్న వారి తోబుట్టువులని గణాంకాలు చెబుతున్నాయి. వీరి సంఖ్య 1.81 లక్షలు కాగా, పెళ్లయిన సంతానం సంఖ్య 42 వేలుగా ఉంది. భార్య/భర్త, మైనర్ పిల్లలు సుమారు 2500 మంది శాశ్వత నివాసానికి ఎదురు చూస్తున్నారు. ఫ్యామిలీ స్పాన్సర్డ్ గ్రీన్‌కార్డులుకు అదనంగా మరో 8.27 లక్షల మంది ఇతర రకాల గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో భారతీయులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.