ఫేస్బుక్ మెసెంజర్లో 50 కోట్ల మంది!
ఫేస్బుక్ మెసెంజర్ యాప్ అంటే మొదట్లో చాలామంది పెద్దగా ఇష్టం చూపించలేదు గానీ, క్రమంగా జనం దానికి బాగానే అలవాటు పడుతున్నారు. ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది ఈ యాప్ను వాడుతున్నారు. గత ఏప్రిల్లో ఈ యాప్ను వాడినవాళ్ల సంఖ్య 20 కోట్లు మాత్రమే. సాధారణ ఫేస్బుక్ కాకుండా.. తాము విడుదల చేసిన మొదటి యాప్ ఇదేనని, ప్రధానంగా చాటింగ్ను సులభతరం చేయడానికి దీన్నిరూపొందించామని ఫేస్బుక్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ పీటర్ మార్టినజ్జీ తన బ్లాగు పోస్టులో తెలిపారు.
దాని వేగాన్ని, విశ్వసనీయతను మరింత పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రతి రెండు వారాలకు దాన్ని మరింత మెరుగు పరుస్తున్నామని చెప్పారు. ఈ యాప్ను విడుదల చేస్తున్నట్లు ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బెర్గ్ ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించారు. అప్పటినుంచి క్రమంగా దీనికి ఆదరణ పెరుగుతూ వస్తోంది.