ఫేస్బుక్ మెసెంజర్ అట్టర్ఫ్లాప్!!
కొత్తగా ప్రవేశపెట్టిన ఫేస్బుక్ మెసెంజర్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పటివరకు పట్టిందల్లా బంగారంలా మారిన మార్క్ జుకెర్బెర్గ్కు తొలిసారి ఎదురుదెబ్బ తగిలింది. చాలామంది యూజర్ల దగ్గరునుంచి దీనికి వ్యతిరేకంగా రివ్యూలు రావడం, విమర్శలు కూడా ఎక్కువ కావడం ఇందుకు నిదర్శనం. ఫేస్బుక్లో చాటింగ్ చేయాలన్నా, మెసేజిలు అందుకోవాలన్నా కూడా తప్పనిసరిగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందేనని ఫేస్బుక్ బలవంతం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
మెసెంజర్కు దాదాపు 50వేల రివ్యూలు వస్తే.. దాదాపు అన్నీ కేవలం ఒకే ఒక్క స్టార్ రేటింగ్ ఇచ్చాయి. ఈ విషయాన్ని యాప్ ఆనీ అనే యాప్ ఎనలిటిక్స్ సంస్థ తెలిపింది. ఒకే పనికి రెండు యాప్లు ఎందుకని, ఇన్నేళ్లుగా ఎలాంటి మార్పులు లేకపోయినా బ్రహ్మాండంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇలా ఎందుకు చేశారని ఓ యూజర్ యూఎస్ యాపిల్ స్టోర్లో తన రివ్యూ పోస్ట్ చేశారు. తనతో బలవంతంగా ఈ యాప్ డౌన్లోడ్ చేయించడం మహా చెత్తగా ఉందని మరో యూజర్ పేర్కొన్నారు.