ఇస్లామాబాద్ : కరాచీలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో భోజనం చేసిన తర్వాత ఇద్దరు మృతి చెందిన ఘటన పాకిస్తాన్‌లో కలకలం రేపింది. సదరు అరిజొనా గ్రిల్ రెస్టారెంట్‌పై అధికారులు జరిపిన దాడుల్లో కుళ్లిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2015లోనే గడువుతీరిన ప్యాకేజ్డ్ మాంసాన్ని, పానీయాలను దాడుల్లో స్వాధీనం చేసుకున్నట్టు పాకిస్తాన్‌కు చెందిన డాన్ న్యూస్ వెల్లడించింది. కరాచీలోని డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ ప్రాంతంలోని ఈ రెస్టారెంట్ తమ కస్టమర్లకు పాచిపోయిన మాంసాన్ని వడ్డించిందని, అధికారుల దాడుల్లో 80 కిలోల కుళ్లిపోయిన మాంసం బయటపడిందని సింధ్ ఫుడ్ అథారిటీ డైరెక్టర్ అబ్రార్ షేక్ తెలిపారు.
హోటల్‌లో పరిశుభ్రతను మెరుగుపరచాలని ఇటీవల అధికారులు ఈ రెస్టారెంట్‌కు నోటీసులు జారీ చేసినట్టు డాన్ కథనం వెల్లడించింది. ఈ రెస్టారెంట్‌లో ఆహారం తీసుకున్న ఇద్దరు మైనర్ల మృతికి కారణం వెల్లడికాకున్నా ఫుడ్ పాయిజన్‌తోనే వీరు మృత్యువాత పడ్డారని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు హోటల్‌ను సీజ్ చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment